మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి ఇంటిపై కొన్నిరోజులుగా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు రోజూ దాడులు జరిగినా ఈ దాడుల గురించి చంద్రబాబు అనుకూల మీడియాలో మాత్రం వార్తలు కనిపించలేదు. అదే ఇతరులకు సంబంధించిన ఎలాంటి ఆదాయపు పన్ను శాఖ దాడులైనా హడావిడి చేసే ఈ మీడియా మాత్రం ఈసారి మూగపోయింది.

 

వరుస దాడుల తర్వాత ఏకంగా రూ. 2000 కోట్ల బండారం బయటపడిందంటూ ఐటీ శాఖే ఓ ప్రకటన చేసింది. ఇంత జరిగినా మాజీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిపై స్పందించలేదు. టీడీపీకి చెందిన అనేక మంది నేతలు ఈ దాడులకూ టీడీపీకి ఏంటి సంబంధం అంటూ ప్రెస్ మీట్లు పెట్టారు కానీ.. చంద్రబాబు మాత్రం స్పందించలేదు.

 

ఇప్పుడు ఈ విషయాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు అనుకూల మీడియాకు ఐటీ దాడులు కనిపించడం లేదా..? అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడినా ఈ మీడియా కళ్లకు గంతలు కట్టినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

 

తన పీఎస్‌ దగ్గర రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్‌ విడుదల చేసినా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి దగ్గర రూ. 2 వేల కోట్ల నల్లధనం దొరికితే చంద్రబాబు, ఆయన సహచరులు, బినామీల దగ్గర ఎంత దొరుకుతుందోనని మంత్రి పెద్ది రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలని పెద్దిరెడ్డి కోరారు. ఐటీ దాడులపై పవన్, కాంగ్రెస్‌ నేతలు ఎందుకు స్పందించడం లేదని మంత్రి నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: