నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జగన్ వైసీపీ చేరబోతోందా.. ఇందుకు రంగం సిద్ధమైందా.. కేవలం రోజు వ్యవధిలో మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడానికి వెనుక ఉన్న అసలైన కారణం ఇదేనా.. ఇవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఇదే సమయంలో మోడీ సర్కారులో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చేశారో వైసీపీ మంత్రి.

 

 

ఆయనే మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్ర ప్రభుత్వంలో చేరాలని ప్రతిపాదన వస్తే అప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ విషయం చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. ఇందుకోసం ఎవరి గడ్డం అయినా పట్టుకుంటామని, అందుకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

 

 

అంతే కాదు.. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని బొత్స ప్రశ్నించారు. భాజపాతో అంటిపెట్టుకుని ఉండటం లేదని.. అలా అని దూరమూ కాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం ఒప్పుకోబోమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం, ఏపీని నంబర్‌ స్థానంలో నిలబెట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానితో భేటీ అయితే దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

 

చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి సమగ్ర విచారణ కోరాలి.. కడిగిన ముత్యం అని చెప్పుకునే లోకేష్‌.. బయటకు రావాలి.. విచారణ జరిగితే ముత్యమో.. మసిబొగ్గో తెలుస్తుంది. పేదవాడి పొట్టకొట్టి తినడం ఏం బతుకు. చంద్రబాబు రాజకీయాలు విరమించుకుంటే మంచిదంటున్నారు మంత్రి బొత్స. సో.. మొత్తానికి .. మోడీ సర్కారులో చేరతామని నేరుగా చెప్పకపోయినా.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పడం.. అలాగే ఎవరి గడ్డమైనా పట్టుకుంటామని చెప్పడం ద్వారా బొత్స అసలు విషయం బయటపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: