ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చినా ఆయన ఏపీ రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు. అటు సినిమాలు చేసుకుంటూనే.. ఇటు రాజకీయ యాత్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యలో చంద్రబాబు పీఎస్ పై జరిగిన ఐటీ దాడుపై పవన్ కల్యాణ్ మాత్రం స్పందించలేదు.

 

ఈ విషయంపై పవన్ మౌనాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై ఆయనకు మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. బయట మాత్రం నిప్పునంటూ చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు.

 

చంద్రబాబుపై విచారణ జరపాలని సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు కూడా డిమాండ్‌ చేయాలన్నారు. మరోవైపు చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు వచ్చాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ నందమూరి లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అవినీతి పరుడికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో పవన్ కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలపై ఐటీ సోదాలు జరిగిన ఆయన ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. రాజధానిలో టీడీపీ ప్రభుత్వం చేసిన వేల కోట్ల అవినీతిని కూడా బయటకు తీయాలి అని కోరారు. అక్రమాలు బయటకు రాకూడదనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని మండిపడ్డారు.

 

చంద్రబాబుకు మద్దతిచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మరొక అంశాన్ని చంద్రబాబు తెరమీదికి తెస్తారని.. అయితే అలాంటి జిమ్మిక్కులకు కాలం చెల్లిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: