ఏపీ సీఎం జగన్ తో బీజేపీ అగ్రనేతలు సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారో లేదో అప్పుడే ఏపీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు తీవ్రతరం చేయడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు చంద్రబాబు కు మద్దతుగా వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు గా కనిపించిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా తెలుగుదేశం పార్టీ పై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు చేశారు. కొద్ది కొద్ది రోజులుగా ఐటీ శాఖ అధికారులు చేస్తున్న దాడులలో భారీ ఎత్తున అక్రమ ఆస్తుల వ్యవహారాలు బయటపడడం పై సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు అవినీతిని తవ్వాలంటే గడ్డపారలు, గునపాలు సరిపోవని, బుల్డోజర్, జెసిబి లు కావాల్సిందేనని  ఆయన సెటైర్లు వేశారు.


 టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, సుమారు 15 కోట్ల రూపాయల విలువైన కాలువ తవ్వకం పనులు 90 కోట్ల రూపాయలకు పెంచి తన వారికి కట్టబెట్టారని అని ఆయన విమర్శించారు. అవినీతి ఏ విధంగా చేయాలి అనే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం ఉందని, అవినీతి పనులు చేయడంలో దేశంలో చంద్రబాబు నెంబర్ వన్ అని సోము వీర్రాజు విమర్శించారు. లోకేష్, చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ఇద్దరు మంచి స్నేహితులు అని , ఇప్పుడు బయటపడింది కేవలం రెండు వేల కోట్లు మాత్రమేనని దీనిపై మరింత గా విచారణ చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయట పడతాయో అంటూ వీర్రాజు అన్నారు. కానీ టిడిపి మాత్రం పీఏ శ్రీనివాస్ తో సంబంధం లేదని వాదిస్తోంది అని, ఆయన బయట నిలబడే సెక్యూరిటీ కాదని, తరచూ చంద్రబాబును అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి అంటూ ఆయన అన్నారు.


 ఎటువంటి అక్రమాలు జరగలేదని అంటున్న వారు చంద్రబాబు దగ్గర  పనిచేసిన వ్యక్తి వద్దకు అంత సొమ్ము ఏ విధంగా వచ్చింది అనేది చెప్పాలని ప్రశ్నించారు.  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు చెట్టు పనుల్లో 25 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సుమారు 4,500 కోట్ల రూపాయల విలువైన పోలవరం పనులను 5350 కోట్ల రూపాయలకు పెంచారని, అలా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. 


ఇక టిడిపి పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు తన కుమారుడు రామకృష్ణ చనిపోయిన తర్వాత యనమల రామకృష్ణుడుని ఎన్టీఆర్ కుమారుడిగా చూసుకున్నారని, ఆయనకు రోజు భోజనం పెట్టి కన్నకొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారని, ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్ ను కూడా చేశారని, అంతగా ఆయనను చూసుకుంటే చంద్రబాబుతో కలిసి కుట్ర పన్ని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని సోము వీర్రాజు మండిపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: