తెలుగుదేశం పార్టీకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో అప్పుడే నాయకులు ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వయసుకు మించి పార్టీ కోసం కష్ట పడుతున్నారు. అధికారపార్టీకి మైలేజ్ రాకుండా అన్ని విషయాల్లోనూ బాబు అడ్డుతగులుతూ ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఈనెల 15 నుంచి 45 రోజుల పాటు జన చైతన్య యాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్లాలని, దాని ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో  కొత్త ఉత్సాహం తీసుకురావడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గట్టెక్కేందుకు తన యాత్రలు ఉపయోగపడతాయని చంద్రబాబు భావిస్తున్నారు.


 అయితే వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడి ఇంకా ఏడాది కూడా పూర్తి అవ్వకుండా అప్పుడే జనాల్లోకి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వెళితే టిడిపిపై విమర్శలు పెరుగుతాయని, అంతే  కాకుండా... ప్రజా చైతన్య యాత్ర ను 45 రోజుల పాటు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదంటూ నేతలు అధినేతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించారు. మూడు రాజధానుల ఏర్పాటు తదితర విషయాలపై  అడ్డు తగిలి పోరాటాలు చేశామని, మళ్లీ ఇప్పుడు 45 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రభుత్వంపై పోరాటం చేయడం అంటే చాలా సమస్యలు వస్తాయని, గ్రామ స్థాయిలో ఈ వివాదాలు మరింత తీవ్రంగా ఉంటాయని టిడిపి నేతలు వెనక్కి తగ్గుతూ .. అధినేత చంద్రబాబును ఈ యాత్ర చేయకుండా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట.


 ఇప్పటికే టిడిపి కి అనుకూలంగా ఉన్న వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. 45 రోజుల పాటు ధర్నా చేస్తే మరింతగా ప్రభుత్వం కేసులు  నమోదు చేస్తుందని నాయకులంతా వెనక్కి తగ్గుతున్నట్టు  తెలుస్తోంది. అదికాకుండా మార్చి 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి, పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అధినేత ఇలా యాత్రల పేరుతో నాయకులకు అందుబాటులో లేకపోతే మొదటికే మోసం వస్తుంది అంటూ మరికొంతమంది అధినేతను హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: