కేంద్రంలోని బీజేపీ , రాష్ట్రం లోని అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య స్నేహం చిగురిస్తోందా ?, అదే నిజమైతే బీజేపీ తో ఇటీవలే జట్టు కట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది . ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో  భేటీకి అధిక సమయం కేటాయించడాన్ని పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి తో మోదీ,  షా ద్వయం స్నేహాన్ని కోరుకుంటున్నట్లుగానే కన్పిస్తోంది . బీజేపీ తో స్నేహం ద్వారా    రాష్ట్రంలోని విపక్షాలన్నింటిని చావుదెబ్బ కొట్టవచ్చన్నది  జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కన్పిస్తోంది .

 

బీజేపీ అండతో తమ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని భావిస్తోన్న పవన్ కు , తామే ఆ పార్టీతో స్నేహం చేయడం ద్వారా చెక్ చెప్పవచ్చునని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ఇకపోతే తమ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తోన్న విమర్శలకు ఇక  ఫుల్ స్టాప్ పడడం ఖాయమని ఆయన ఒక అంచనాకు వచ్చి ఉంటారని చెబుతున్నారు . టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి , అక్రమాలు వెలికి తీయాలంటే కేంద్రంలోని బీజేపీ సహకారం ఎంతో అవసరమని జగన్ భావించి ఉంటారని అంటున్నారు .

 

బీజేపీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటి వరకూ కేంద్ర , రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలే కొనసాగుతూ వస్తుండగా  , తాజాగా చోటు చేసుకుంటున్న  పరిణామాలు పరిశీలిస్తే ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తున్నట్లే కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు .  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని కేంద్ర కేబినెట్ లో చేరాల్సిందిగా  ఆ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోదీ  కోరినట్లుగా  ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ , ప్రధానిని కలిసిన మర్నాడే కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడం , ముఖ్యమంత్రి ఆయన్ని కలిసేందుకు హుటాహుటినా బయల్దేరి వెళ్లడం పరిశీలిస్తే , ఈ రెండు పార్టీల మధ్య గతానికి భిన్నమైన వాతావరణం స్పష్టంగా   కన్పిస్తోంది  .

మరింత సమాచారం తెలుసుకోండి: