తెలంగాణలో బలపడాలని ఆశ బీజేపీలో బలంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ఆ పార్టీకి పరిస్థితులు కలిసి రావడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్న బీజేపీ దానికి తగినట్లుగా ఇతర పార్టీ నాయకులను బీజేపీ లోకి వచ్చి చేరే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలామంది తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని ఆశలు పెట్టుకొని పార్టీలో చేరిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి మాత్రమే ఉందన్న అంచనాతో చాలామంది నాయకులు బీజేపీ వైపు ఆశగా ఎదురు చూశారు. 


అనూహ్యంగా తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గాలి బలంగా వీయడంతో అక్కడ సరికొత్త జాతీయ రికార్డుని సృష్టిస్తూ టీఆర్ఎస్ సీట్లను గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై భారీగా ఆశలు పెట్టుకున్న బిజెపి ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు చూసి ఢీలా పడిపోయింది. ఇక అప్పటి నుంచి పార్టీలోకి వచ్చి చేరతారని భావిస్తున్న నాయకులంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వచ్చే ఎన్నికల నాటికి కూడా బిజెపి తెలంగాణలో బలపడడం కష్టమే అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక మూడు రోజుల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క్రేజివాల్ ప్రభుత్వం కనివిని మెజార్టీతో గెలుపొందడం, బిజెపి ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోవడం, ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు అద్దంపడుతున్నాయి.


 ఇప్పుడు పార్టీలో వచ్చి చేరేందుకు ఏ ఒక్క నేత ఆసక్తి చూపించకపోవడం తో భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అదీ కాకుండా తెలంగాణ బీజేపీ ని టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ముందుకు నడిపించే సమర్ధుడైన నాయకుడు లేకపోవడం, క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బిజెపి తెలంగాణలో బలపడలేకపోవడానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో చాలామంది రాజకీయ సీనియర్లు ఉన్నా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఆ పార్టీకి కరువయ్యారు. ఇదే బీజేపీ అగ్ర నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: