ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు.

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక కారిడార్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రికి ఆదేశాలిచ్చారు. విశాఖ-చిత్తూరు, హైదరాబాద్-వరంగల్ కారిడార్ తదితర ప్రాజెక్టులపై కేంద్రమంత్రికి ఉపరాష్ట్రపతి ఆదేశాలిచ్చారు. కాకినాడలో ఐఐపీ, ఐఐఎఫ్‌టీ పనుల ప్రగతిపై ఆరా తీశారు. గుంటూరులో స్పైస్ పార్క్, రంగారెడ్డిలో ఫార్మాసిటీ అంశాలపైనా చర్చించారు.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రితోపాటు వాణిజ్య శాఖ కార్యదర్శి, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

 

 

విశాఖపట్టణం-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటుచేయ సంకల్పించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గుంటూరులోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

 

 

తెలంగాణలోని హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ అంశంపైనా ఉపరాష్ట్రపతి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు వాటికి నిర్దేశించి సమయంలోగా పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: