ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు దేశం పార్టీ అనుయాయుల మీద వరుసగా ఐటీ దాడులు జరుగుతుండటం, మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటం లాంటి అంశాల మధ్య జగన్‌.. ప్రధానీ, అమిత్‌ షాలతో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్‌ భేటీ సందర్భంగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్‌ఆర్సీపీ ఎంపీలకు కేంద్రలో మంత్రి పదువులు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో విజయ సాయి రెడ్డి, నందిగం సురేష్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

 

ఈ పరిణామాలపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆచితూచి స్పందించారు. ఇప్పటికే తాము కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామన్నారు. `జగన్‌కు ప్రధాని, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వారం రోజుల క్రితం వార్తలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు బీజేపీ, వైఎస్సార్సీపీ కలిసిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది కరెక్టర్‌` అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో తాము ఎందుకు గొడవ పడాలని మంత్రి బొత్స అన్నారు. తాము కేంద్రంతో స్నేహం చేయటంలేదు అలాగే.. వైరమూ పెంచుకోవటం లేదని మంత్రి తెలిపారు.


రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తామన్న బొత్స, కేంద్రాన్ని బతిమాలడానికైన సిద్ధమే అని తెలిపారు. అదే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే.. ఎవరినైనా ఎదిరిస్తామని తెలిపారు. అదే సమయంలో కేంద్రంలో చేరే అవకాశం వస్తే పరిశీలిస్తామని మంత్రి బొత్స తెలిపారు. దాని వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందనుకుంటే చేరతామని, అవసరం లేదనుకుంటే మానేస్తామన్నారు.

 

ఈ సందర్భంగా చిరంజీవికి వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని జరుగుతున్న ప్రచారంపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధి కావాల్సిన నిర్ణయాలను అధినేత తీసుకుంటారన్నారు. అయితే ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీల ప్రియారిటీ లిస్ట్‌ చెప్పలేన్న బొత్సా, మరో రెండు నెలలో తెలుస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: