కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు . పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదాచేశామని చెప్పారు. ప్రాజెక్టు రివైజ్డ్‌ అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించింది.

 

దీనికి సంబంధించిన పరిపాలనపరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల రూపేణా, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10, 610 కోట్లు మాత్రమే వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

 

వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి. గడచిన మూడేళ్ల నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని హోంమంత్రి ముందు ఉంచారు జగన్. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి సగటున రూ.4000 ఇస్తే, ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాల్లో కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ ఖండ్‌ తరహాలో విస్తరించాలని హోంమంత్రిని జగన్ కోరారు. రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. దీన్ని ఇప్పించాల్సిందిగా హోంమంత్రిని జగన్ కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: