అమరావతి లో ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు  ఈ పర్యటన వలన ఎంతవరకు ఉపయోగం ఉంటుంది  అన్నది ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న అనుమానం.  ఎందుకంటే, రాజధానుల వ్యవహారం అన్నది ప్రజల చేతుల్లో కాదు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది.  ఈ విషయంలో కేంద్రం కూడా  ఎలాంటి జోక్యం చేసుకొదు అని చెప్పి ఇప్పటికే కేంద్రం చెప్పింది.  


అయితే, బిజేపి మాత్రం ఒక్క రాజధానికే అనుకూలంగా ఉన్నట్టుగా సంకేతం ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ విషయంపై రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కన్నా ఇప్పటికే స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ కూడా ఒక్క రాజధానికే ఓటు వేయడమే కాకుండా, మూడు రాజధానుల వలన ఉపయోగం ఉండదని, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి అంటే మూడు రాజధానుల కాదని,  మూడు చోట్ల కంపెనీలు తీసుకొస్తేనే అభివృద్ది సాధ్యం అవుతుందని అన్నారు.  


ఈ ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఈరోజు రాజధాని అమరావతిలో పర్యటించబోతున్నారు.  రాజధాని రైతులను కలిసి మాట్లాడబోతున్నారు.  అయితే, రాజధానిలో పర్యటించి రాజధాని రైతులను పరామర్శించినంత మాత్రాన మూడు రాజధానుల నిర్ణయం నుంచి ప్రభుత్వం మార్చుకుంటుందా అంటే లేదని అంటున్నారు.  ఎన్ని చేసినా చివరకు రాజధాని ఒక్కటే ఉంటుంది అని ఇప్పటికే పవన్ అంటున్నారు.  ఇప్పుడు వైకాపా ఎన్ని రాజధానులు పెట్టుకున్నా, తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా చేస్తామని అంటున్నారు.  


ఫిబ్రవరి 2 వ తేదీన పవన్ విజయవాడలో లాంగ్ మార్చ్ చేస్తామని అన్నారు.  కానీ, ఎందుకు చేయలేదు అన్నది తెలియలేదు.  ఇప్పుడు రాజధాని రైతులను కలిసి మాట్లాడటం వలన ఉపయోగం ఏముంటుంది.  గతంలో పవన్ చెప్పినట్టుగా రాజధాని విషయం చేయి దాటిపోయిన అంశం.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.  రాజధానుల విషయం తమ చేతుల్లో లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.  ఈ సమయంలో పవన్ మాత్రం ఏం చేయగలడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: