ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. రెండు రోజుల గ్యాప్ తో సీఎం జగన్ మోదీ, అమిత్ షాలతో భేటీ కావడం గురించి రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం జగన్ మోదీ, అమిత్ షాలతో భేటీ కావడంతో కేంద్ర కేబినేట్ లోకి వైసీపీ పార్టీ చేరబోతుందని కేంద్రం ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
వైసీపీ పార్టీ వర్గాలు మాత్రం కేవలం రాష్ట్ర సమస్యల గురించి జగన్ మోదీ, అమిత్ షాలతో చర్చిస్తున్నారని చెబుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ సీఎం జగన్ ను ఒక సహాయం కోరారని సీఎం జగన్ అందుకు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ సీఎం జగన్ ను వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ రాజ్యసభ సీట్లలో ఒకటి తమకు కేటాయించాలని కోరగా జగన్ మొదట మౌనం దాల్చినా ఆ తరువాత అంగీకరించారని తెలుస్తోంది. 
 
రాబోయే రెండు నెలల్లో వైసీపీ పార్టీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఏపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవారి పదవీకాలం పూర్తి కావడంతో వైసీపీ ఖాతాలోకి రాజ్యసభ సీట్లు వెళ్లనున్నాయి. వైసీపీ 151 ఎమ్మెల్యేల బలంతో మూడు ఎంపీ సీట్లను గెలుపొందడం ఇప్పటికే పక్కా కాగా ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే నాలుగో రాజ్యసభ సీటు కూడా వైసీపీకే చేరనుంది. 
 
గతంలో తెలుగుదేశం బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ ఎంపీగా సురేష్ ప్రభుకు అవకాశం లభించింది. జగన్ అంగీకరించారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్డీఏలో వైసీపీ పార్టీ చేరనుందని వినిపిస్తున్న వార్తలు కూడా నిజమేనని తెలుస్తోంది. మరి వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా...? బీజేపీకి రాజ్యసభ సీటు ఇస్తుందా...? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: