అతను ఆ మడిలోనే వాయు వేగంతో పరిగెత్తాడంటే.. అదే వ్యక్తి ట్రాక్‌ మీద అడుగుపెడితే.. రికార్డులే అతని వెంటపడతాయేమో. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. కర్ణాటకలో జరిగిన సాంప్రదాయ క్రీడ కంబళ పోటిల్లో భాగంగా ఓ అరుదైన వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత రన్నర్‌ ఉసేన్‌ బోల్ట్‌కు కూడా చెమటలు పట్టించే వేగంతో ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయాడు కర్ణాటకు చెందిన శ్రీనివాస గౌడ.

 

శ్రీనివాస గౌడ.. కొద్ది రోజుల క్రితం వరకు ఈ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఇతను ఓ సూపర్‌ స్టార్‌. సోషల్ మీడియాలో ప్రముఖులు కూడా ఇతని ఘనత పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. స్టార్‌ అథెలెట్‌ ఉసేన్‌ బోల్ట్‌తో శ్రీనివాస గౌడను పోలుస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు. సాధారణ భవన నిర్మాణ కార్మికుడైన శ్రీనివాస్‌ ఒక్కసారిగా ఈ స్థాయికి ఎలా చేరాడు. ఆయన సాధించిన ఆ ఘనత ఏంటి..?

 

కంబళ అంటే తుళు భాషలో వరి మడి అని అర్ధం. వరి మడిలో జరిగే సాంప్రదాయ ఆటల పోటి కాబట్టి ఈ ఆటకు అదే పేరును పెట్టారు. మడిలో దున్నపోతులను వేగంగా పరిగెత్తిస్తూ వాటి వెనుక ఓ మనిషి కూడా పరిగెడతాడు. ఈ ఆటే శ్రీనివాస్‌ను స్టార్‌ను చేసింది. ఇటీవల జరిగిన కంబళ పోటిలో శ్రీనివాస గౌడ తన దున్నపోతులతో కలిసి 142.4 మీటర్ల దూరాన్ని కేవలం 13.42 సెకన్లలో పరిగెత్తాడు. ఈ లెక్కన అతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే చేరుకున్నాడు.

 

అంటే  శ్రీనివాస గౌడ, ఉసేన్‌ బోల్ట్‌ సెట్ చేసిన ప్రపంచ రికార్డ్ కంటే 0.3 సెకన్ల తక్కువ సమయంలో వంద మీటర్ల దూరం పరిగెత్తాడు. అయితే ఈ ఘనతను ఏ రికార్డు సంస్థలు గుర్తించకపోయినా సోషల్ మీడియా మాత్రం ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. అయితే శ్రీనివాస్ మాత్రం తన పరుగు కారణం తన దున్నపోతులే అంటున్నాడు. అవి అంత వేగంగా పరిగెత్తబట్టే తాను వాటితో పాటు పరిగెత్తగలిగానని చెపుతున్నాడు.

 

శ్రీనివాస గౌడ ప్రతిభ గురించి విన్న సామాన్య ప్రజలు మాత్రం ఆయన సామర్ధ్యాన్ని దేశం కోసం వినియోగించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఆయనకు సరైన శిక్షణ ఇచ్చిన క్రీడాకారుడిగా మలిస్తే దేశం గర్వించే స్థాయికి రావటమే కాదు, ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు విజయం అందిస్తాడంటున్నారు. మరి ప్రజల విన్నపాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: