గత వారం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జేబీఎస్ ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు. కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధులు ఇస్తున్నా టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన ఖాతాలోనే క్రెడిట్ వేసుకుంటోందని కేంద్రం భావిస్తోంది. 
 
ఈరోజు కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం మెట్రో ప్రాజెక్టు కొరకు అందించిన నిధుల గురించి సమీక్ష చేయటంతో పాటు మెట్రో పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కిషన్ రెడ్డి ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతో మరియు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో ఈ సమావేశం జరగనుంది. 
 
జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కొందరు సీనియర్ నాయకులు, మెట్రో ఉన్నతాధికారులు మెట్రోలో ప్రయాణం చేయనున్నారు. బీజేపీ పార్టీ వర్గాలు అధికారుల నుండి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని చెబుతున్నాయి. బీజేపీ పార్టీ ముఖ్య నేతలు ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రారంభించటం అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు తనకు ఆహ్వానం పంపించకుండా మెట్రో అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ఆహ్వానం అందలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు జరిగే మెట్రో రివ్యూలో మెట్రోలో కేంద్రం వాటా ఎంతో చెప్పటం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకొనిరావాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: