ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు హస్తినకు వెళ్లడం ఆంధ్ర రాజకీయాలలో కలకలంగా మారింది. ఏపీ సీఎం.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో వరుస భేటీలు రాజకీయంగానూ ఆసక్తిరేపుతోంది. వైఎస్సార్‌సీపీ కేంద్ర కేబినెట్‌లో చేరబోతోందని.. ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు రాబోతున్నాయని మీడియాతో పాటూ సోషల్ మీడియా మొత్తం ప్రచారం సాగించింది. వైఎస్సార్‌సీపీ వర్గాలు మాత్రం అదేం లేదని చెప్తోంది.

 

 

అయితే.. ఇప్పుడు తాజాగా మరో ప్రచారం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రిని ఓ సాయం కోరారనే చర్చ జరుగుతోంది. త్వరలో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వాలని (అంటే వైఎప్సార్‌సీపీ వచ్చే రాజ్యసభ సీట్లలో ఒకటి తమకు కేటాయించాలని) అడిగారట. తమకు సహకరించాలని.. ప్రధాని మోదీ తన మనసులో మాట బయటపెట్టారట.

 

 

 

గతంలో టీడీపీ- బీజేపీ మధ్య ఇలాంటి డీల్ కుదిరింది. రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా సురేష్ ప్రభుకు బీజేపీ ఎంపీగా ఏపీ నుంచి అవకాశం కల్పించారు. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ మరోసారి రాజ్యసభ సీటు కోసం వైఎస్సార్‌సీపీని సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై జగన్ ఎలా స్పదించారన్నదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.. వైఎస్సార్‌సీపీ వర్గాలు కూడా ఈ ప్రచారంపై (మోదీ జగన్‌ను ఎంపీ సీటు అడిగినట్లు) స్పందించలేదు.

 

 

 

ఇదిలా ఉంటే కేంద్ర కేబినెట్‌ లో వైఎస్సార్‌సీపీ చేరుతుంది అనే ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామన్నారు.. కేంద్రంతో తాము ఎందుకు గొడవ పడాలని ప్రశ్నించారు. కేంద్రంలో చేరే అవకాశం వస్తే పరిశీలిస్తామని.. దాని వల్ల మేలు కలుగుతుందనుకుంటే చేరతాం.. అవసరం లేదనుకుంటే మానేస్తామన్నారు. తాము కేంద్రంతో అంటిపెట్టుకొని తిరగడం లేదని అలాగే.. దూరమూ జరగడం లేదని బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే.. దేన్నీ ఉపేక్షించబోమన్నారు. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా వైఎస్సార్‌సీపీ కేంద్రంలో చేరుతుందా.. బీజేపీకి రాజ్యసభ సీటు ఇస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: