రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కేంద్రంతో సంబంధాల విష‌యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అడుగులు వ‌డివ‌డిగా వేస్తోంది. నిజానికి కేంద్రంతో సంబంధాల విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. త‌ర్వాత బీజేపీ నుంచి విలీన సంకేతాలు రావ‌డంతో పార్టీ త‌న ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకుంది. దీంతో ఇప్పుడు బీజేపీ వైపు వైసీపీ, వైసీపీ వైపు బీజేపీ చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీ, బీజేపీ మాజీ సార‌థి అమిత్ షాల‌తో భేటీ ఈ కోణంలోనే ఉండ‌డంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి అన్ని వ‌ర్గాల్లోనూ నెల‌కొంది.

 

ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఆరోపిస్తూ వ‌చ్చిన‌ట్టుగా బీజేపీతో వైసీపీ సంబంధాలు పెట్టుకునే విష యంపై క్లారిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు టీడీపీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్తితి ఇప్పుడు క‌నిపించడం లేదు.  అయితే, ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ వ‌ర్గం దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌నే విష‌యం ఇటు వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మ‌రోప‌క్క‌, ఎన్నార్సీ, సీఏఏ వంటి బిల్లుల విష‌యంలో త‌మ వైఖ‌రిని ఇప్ప‌టికే వైసీపీ స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో బీజేపీ నుంచి ఈ రెండు బిల్లుల‌కు మ‌ద్ద‌తు విష‌యంలో వైసీపీపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అసెంబ్లీలో ఈ రెండు బిల్లుల‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేసే ప‌రిస్థితి వైసీపీకి ఉండ‌దు.

 

ఈ విష‌యాన్ని టీడీపీ రాజ‌కీయంగా వాడుకుని వైసీపీని ఇరుకున పెట్టే అంశం కీల‌కంగా మార‌నుంది. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ వైఖ‌రి స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీని వైసీపీ ఒప్పించి, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో క్లారిటీ తెచ్చుకోక పోతే.. ఇది కూడా వైసీపీకి మైన‌స్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, బీజేపీ పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తే.. అది జ‌గ‌న్‌కు ఇబ్బందే త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని కూడా అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఎలా మార‌నున్నాయ‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. అయితే, ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను వ్య‌తిరేకించే వారికి ముకుతాడు వేయ‌డంలో జ‌గ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంద‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: