పర్యావరణాన్ని పరిక్షించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియంత్రణ కోల్పోయిందా? సింగరేణి ఇచ్చే ఫ్యాకేజీలు తీసుకొని పీసీబీ పోల్యుట్ అయ్యిందా?  పొల్యూషన్ బోర్డుపై జనం ఎందుకు తిరగబడుతున్నారు?సింగరేణి ప్రభావిత ప్రాంతంలో పోలీస్ పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఎంతవరకు సమంజసం? సింగరేణి  కారణంగా మనుషులు చచ్చిపోతున్నా యాజమాన్య తన వైఖరి ఎందుకు మార్చుకోవటం లేదు?బొగ్గు తవ్వకాలు నిలిపి వేయాలనే స్థానికుల డిమాండ్‌పై సింగరేణి  అధికారుల రియాక్షన్ ఏంటి?


  .
 ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.  సింగరేణి ప్రాంత ప్రజలు కాలుష్యంపై అధికారులను నిలదీశారు. గత 15 ఏళ్లుగా ఓపెన్ కాస్ట్ వల్ల సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల  రూపాయల లాభాలు గడిస్తున్న యాజమాన్యం పర్యావరణ నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సత్తుపల్లి ప్రాంతం నేడు  బొగ్గు నుంచి వెలువడే కాలుష్యంతో నిండిపోయింది అని స్థానికులు అధికారులకు తెలిపారు. బొగ్గు వెలికితీసే సమయంలో వెలువడే కాలుష్యం కారణంగా జనం  అనారోగ్యాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ సమీపంలోని చెరువులు, వాగులు, వంకలు కలుషితం అవుతున్నాయి. సింగరేణి కోసం భూములు  కోల్పోయిన కుటుంబాలు జీవనభృతి లేక రోడ్డున పడ్డాయి. సింగరేణి భూ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగనేలేదు. 

 

ఇక...సత్తుపల్లి ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన పొల్యూషన్  బోర్డుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం లేకుండా ఎలా వస్తారని  నిలదీశారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సీపీఐ, సిపిఎం నాయకులు సభలోనే ఆందోళన చేపట్టారు.  ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం సత్తుపల్లి ప్రాంత అభివృద్ధికి ఏం చేసిందో తెలపాలని స్టేజ్ ముందే బైఠాయించారు.

 

మరోవైపు...సత్తుపల్లి నుంచి కొత్తగూడెం బొగ్గును తరలించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. టిప్పర్‌లు అధిక వేగంగా వెళ్ళటం వల్ల ప్రమాదాలు  జరిగి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో బొగ్గు లారీలు సత్తుపల్లి నుంచి కొత్తగూడెం తిరగటంతో ప్రధాన రహదారి ధ్వంసం అవుతోంది. ఫలితంగా  సాధారణ ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: