బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి ఏపీ మ‌రిచిపోయారా?  గ‌డిచిన నెల రోజులుగా ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నెల రోజుల కింద‌ట ఆయ‌న ఏపీ రాజ‌కీయాల్లో దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో ఇత‌ర బీజేపీ నాయ‌కుల‌కంటే కూడా ముందుగానే సుజ‌నా స్పందించారు. వారంలో రెండు మూడు సార్లు అమ‌రావ‌తి ప్రాంతానికి వ‌చ్చి రైతుల ప‌క్షాన గ‌ళం వినిపించారు. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల‌పైనాకూడా విరుచుకుప‌డ్డారు. కేంద్రానికి చెప్ప‌కుండా, కేంద్రం ఒప్పుకోకుండా రాజధా నిని అంగుళం కూడా క‌దిలించ‌లేర‌ని కూడా హాట్ హాట్ కామెంట్లు క‌మ్మేశారు.

 

దీంతో రాజ‌ధాని ప్రాంత రైతులు సుజ‌నా వ్యాఖ్య‌ల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. సుజ‌నా వ్యాఖ్య‌ల‌ను ఇక్క‌డి రైతులు కూడా విశ్వ‌సించారు. ఇంకేముంది ..కేంద్రంతో సుజ‌నాకు మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి కాబ‌ట్టి త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. అయితే, గ‌త నెల రోజులుగా సుజ‌నా అడ్ర‌స్ మిస్స‌యింది. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.. ఆయ‌న వాణి కూడా వినిపించడం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది?  అంత ఎత్తున లేచిన సుజ‌నా ఒక్క‌సారిగా చ‌తికిల ప‌డిపోవ‌డం వెనుక అంత‌రార్థం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

 

ఈ విష‌యంలో ఢిల్లీ వ‌ర్గాలు కొన్ని క్లారిటీలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం బీజేపీకి, టీడీపీకి మ‌ధ్య అస్స‌లు ప‌డ డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీతో క‌లిసి సాగాల‌ని భావిస్తున్నా.. గ‌తంలో ఆయ‌న అన్న‌మా ట‌లు, చేసిన ప‌నులు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వానికి రుచించ‌డం లేదు. దీంతో టీడీపీ వ్యూహాత్మ‌కం గా పంపిన న‌లుగురు ఎంపీల విష‌యంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీలోనే ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిని మంద‌లించింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీ క్లారిటీతో ఉంద‌ని, దీనికి విరుద్ధం గా ఎవ‌రూ వ్యాఖ్య‌లుచేయ‌రాద‌ని ఇప్ప‌టికే డిల్లీలో సీనియ‌ర్లు సుజ‌నా వంటి వారికి క్లాస్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో జీవీఎల్ త‌ప్ప ఎవ‌రూ నోరెత్త‌రాద‌నే సంకేతాలు వ‌చ్చిన నేప‌థ్యంలోనే సుజ‌నా సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. దీంతో ఇక‌, రాజ‌ధాని రైతులు సుజ‌నాపై ఆశ‌లు వ‌దుల‌కున్న‌ట్టేన‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: