తెలంగాణ వర్సిటీలో అధ్యాపకుల కొరత విద్యార్థులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ కాకపోవటంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు...తెలంగాణ యూనివర్సిటీలో ఈ దుస్థితికి కారణం ఏంటో తెలుసా..?


   .
తెలంగాణ యూవర్సిటీ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. పేరుకి రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీ అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు భర్తీ కాని పరిస్థితి. ఉన్నవారితోనే అరకొరగా నెట్టుకొస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. 30 కోర్సులకు పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు.  రెండు, మూడు సబ్జెక్టులకు కలిపి ఒక్కరే పాఠాలు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు 144 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 72 మంది మాత్రమే రెగ్యూలర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఇంకా 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

 

రెండేళ్ల కిందట ప్రభుత్వం తెలంగాణ యూవర్సిటీకి 68 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో 24 అసిస్టెంట్  ప్రొఫెసర్లు, 26 అసోసియేట్‌ ప్రొఫెసర్లు,11 మంది ప్రొపెసర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం అనుమతిచ్చినా పోస్టుల భర్తీపై స్పష్టత, ఉద్యోగ ప్రకటన లేకపోవటంతో రెండేళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవానికి రెండేళ్ల పీజీ కోర్సుకు ఏడుగురు...ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు తొమ్మిది మంది రెగ్యులర్‌ ప్రొఫెసర్లు ఉండాలి. తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌, భిక్కనూర్‌ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో 29 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన వాటిల్లో శాశ్వత అధ్యాపకులు లేరు. కొన్ని విభాగాలకు పోస్టులు కూడా మంజూరు కాలేదు. ఈ ఏడాది ప్రారంభించిన మూడు కోర్సులదీ అదే పరిస్థితి. ఎమ్మెస్సీ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో రెగ్యులర్‌ స్టాప్  ఒక్కరే ఉన్నారు. ఈ ప్రకారం చూస్తే ఇంకా 80 మంది రెగ్యులర్ అధ్యాపకుల పోస్టుల అవసరం ఉంటుంది. ప్రభుత్వం మాత్రం గతంలో ఖాళీగా ఉన్న వాటి భర్తీకే అనుమతి ఇవ్వడంలేదు. ఇక కొత్త వాటి సంగతి అంతేనంటున్నారు యూనివర్సిటీ విద్యార్థులు. 

 

2018 ఫిబ్రవరిలో ప్రభుత్వం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల భర్తీకి అనుమతి వచ్చింది. సంబంధిత ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారని వార్తలు వినిపించాయి. వర్సిటీల్లో పని చేస్తున్న ఒప్పంద ఆచార్యుల సమస్య పరిష్కారమవగానే నోటిఫికేషన్‌ వస్తుందని అప్పట్లోనే మంత్రులు ప్రకటన చేశారు. ఉద్యోగాలపై నిర్ణయం తీసుకుని రెండేళ్లు కావొస్తున్నా అడుగు మందుకు పడటం లేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినా నియామక ప్రక్రియ పూర్తి కావటానికి ఐదు నెలల సమయం పట్టే అవకాశముందంటున్నాయి యూనివర్సిటీ వర్గాలు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు విద్యార్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: