సాధారణంగా బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరూ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలను జరుపుతారు. ఇకనుండి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా వినియోగదారులకు గతంతో పోలిస్తే భారీగా భారం పడనుందని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం కొన్ని రోజుల క్రితం లేఖ రాసింది. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లేఖకు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
సాధారణంగా ఒక బ్యాంకు కార్డును ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఉపయోగిస్తే ఖాతాదారుడు ఆ ఏటీఎం ఆపరేటర్ కు ఇంటర్ ఛేంజ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కస్టమర్లకు ఐదు లావాదేవీలు ఉచితంగా అందుతుండగా ఐదు లావాదేవీలను మించి జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో చార్జీలను వసూలు చేస్తున్నారు. ఏటీఎం కార్డ్ లావాదేవీల విషయంలో నిబంధనలు నగరాల్లో ఒకలా గ్రామాల్లో మరోలా ఉన్నాయి. 
 
ప్రస్తుతం నగదు విత్ డ్రాలకు 15 రూపాయలు, నగదు రహిత లావాదేవీలకు 5 రూపాయల చొప్పున చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచాలని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాసింది. ఏటీఎంల నిర్వహణ ఖర్చు గతంతో పోలిస్తే భారీగా పెరిగిందని రేట్లు పెంచకపోతే భారీగా నష్టాలు వస్తాయని అందువలనే కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయడం లేదని ఏటీఎం ఆపరేటర్ల సంఘం పేర్కొంది. 
 
2019 సంవత్సరంలో ఆర్బీఐ దేశంలో ఏటీఎంల వినియోగం పెంచేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసింది. నగదు లావాదేవీలకు ఇంటర్ ఛేంజ్ ఫీజును 17 రూపాయలకు పెంచాలని నగదు రహిత లావాదేవీలకు ఇంటర్ ఛేంజ్ ఫీజును 7 రూపాయలకు పెంచాలని కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఆర్బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖాతాదారులపై అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: