వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్థుడిగా ముద్ర పడిన నాయకుడు నందిగం సురేష్‌. పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినా.. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత కాకపోయినా జగన్‌, ఆయన్ను నమ్మి ఎంపీగా గెలిపించుకున్నాడు. అందుకే పార్టీలోనూ నందిగం సురేష్‌కు ఇప్పుడు మంచి విలువే ఉంది. అయితే ఇంత పేరుంది కాబట్టే నందిగం సురేష్‌ పేరును తమ దందాలకు వాడుకోవాలని అనుకున్నారు.. కొందరు యువకులు. ఓ స్కార్పియో వాహనానికి ఎంపీ స్టిక్కర్‌ వేసుకొని, తాము నందిగం సురేష్‌ మనుషులమంటూ చెప్పుకొని దందాలకు దిగుతున్నారు.



ఇటీవల మంగళగిరి ప్రాంతంలో ఓ భూవివాదాన్ని సెటిల్ చేసేందుకు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే వచ్చారా యువకులు. దీంతో విషయం ఎంపీ నందిగం సురేష్‌ వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సురేష్ స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన పేరు వాడుకొని దందాలు చేస్తున్న యువకులను మందలించారు. వాళ్ల స్కార్పియో వాహనానికి ఉన్న ఎంపీ స్టిక్కర్‌ను తొలగించి భవిష్యత్తులో ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మందలించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందు నుంచి ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటుంది.



అవినీతి రహిత పాలన అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ప్రతీ పనిలోను పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవినీతి విషయంలో జగన్‌ గట్టి వార్నింగే ఇచ్చాడని తెలుస్తోంది. తప్పు చేస్తే ఎంతటి వారిపైన అయిన కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగానే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.



ఈ నేపథ్యంలో తాము తప్పులు చేయకపోయినా తమ పేరు వాడుకొని ఎవరైన తప్పు చేస్తే అవి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న భయంతో మరింత అలెర్ట్‌ గా ఉంటున్నారు వైసీపీ నాయకులు. అస‌లే రాజ‌ధాని ప్రాంతంలో వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. ఈ క్ర‌మంలోనే  వాళ్ల‌కు సంబంధం లేకుండా ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డంతో వాళ్లు తీవ్ర అస‌హ‌నంతో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: