ఒక‌ప్పుడు అంద‌రూ ఉమ్మ‌డి కుటుంబంలో ఉండేవాళ్ళం దాంతో అమ్మ‌మ్మ‌లు, నాయ‌న‌మ్మ‌లు క‌థ‌లు చెప్పేవారు. పూర్వం ఉన్న రాజుల క‌థ‌ల ద‌గ్గ‌ర నుంచి మంచి చెడులు అన్నీ నేర్పే పెద్ద‌వారు ఉండేవారు. అప్ప‌ట్లో పిల్ల‌లు ప‌డుకోక‌పోతే క‌థ‌లు చెప్పి మ‌రి ప‌డుకోబెట్టేవారు. కానీ ప్ర‌స్తుతం అంత ఓపిక‌, ఓర్పు ఎవ‌రికి ఉండ‌డంలేదు. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వారు కూడా ఎవ్వ‌రూ ఉండ‌డం లేదు. ఎవ‌రి జీవితం వారిదిలా ఉంటున్నారు నేటి యువ‌త‌. క‌థ‌లంటే ఏంటో కూడా నేటి పిల్ల‌ల‌కు తెలియ‌దు. టైం దొరికితే టీ వీ చూడ‌టం. లేదా వీడియో గేమ్‌లు, లేదంటే స్మార్ట్ ఫోన్‌లు వీటితోనే స‌మ‌యాన్నంతా వెళ్ళ‌దీస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌కు కూడా అంత ఓపిక‌గా పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకుని క‌థ‌లు చెప్ప‌డం ఇవ‌న్నీ ఒప్పుడు ఉండేవి. ఇప్పుడు అలాంటివేమి లేవు. 

 

కాని ఒక కథ విని దాని గురించి ఆలోచనలో పడటం వల్ల మెదడులో నరాలు బాగా పని చేసి మైండ్‌ షార్ప్‌ అవుతుందని చెబుతున్నారు .  పిల్లల మానసిక నిపుణులు. జపాన్‌ జరిపిన ఒక సర్వేలో ఇంట్లో ఖాళీ సమయంలో టీవీ చూస్తూ లేదా వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల మెదడు కన్నా కథలు చెప్పించుకుని వినే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తోందని తేల్చి చెప్పారు.


 కాల్పనిక కథలు, జానపద కథలు ఇలా ఎన్నో రకాల కథలు పిల్లల్ని ఎంతో ఆలోచింపచేస్తాయి. పిల్లలకి గిఫ్ట్స్‌ రూపంలో కథల పుస్తకాలు కొని ఇస్తూ ఉంటే వాళ్లు కూడా వాళ్ల ఫ్రెండ్స్‌కి అలా పుస్తకాలు కొనివ్వడం అలవాటు చేసు కుంటారు. కథల పుస్తకాలు చదవటం వల్ల గ్రహింపు శక్తి పెరగటమే కాదు కళ్లకి కూడా ఒక ఎక్సర్‌ సైజ్‌లా పనిచేస్తుందట.

 

బొమ్మల ద్వారా కూడా కథలను చెప్పవచ్చు. వీటి ద్వారా కథల్లోని నీతితో పాటు ఆ బొమ్మల్లోని అంశాన్నీ గ్రహించగలుగుతారు. ఇంకా కథా చిత్రాల ద్వారా కూడా కథ చెప్పవచ్చు. ఈ విధానంలో ఒక చార్టుపై బొమ్మలు ఉంటాయి. వాటిని చూపిస్తూ కథను చెప్పమనాలి. గొలుసు కథలను అల్లాలి. ఒక్కొక్కరి చేత కథను కొనసాగించాలి. ఎవరి ఊహాశక్తి మేరకు వారిని సొంతంగా కథను అల్లమనాలి. ఒకరు ఆపేసిన దగ్గర నుంచి మరొకరు ప్రారంభించాలి. కథను ఎంతసేపు చెప్పాలనేది పిల్లల ఉద్వేగాన్ని బట్టి కొనసాగించాలి. అదేపనిగా సాగదీస్తే ఆసక్తి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారిలోని ఉత్సాహాన్ని గమనిస్తూ కథా గమనాన్ని కొనసాగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: