వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు తనయుడు లోకేశ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఐటీ దాడులు జరిగాయని అప్పట్లో జరిగిన ఐటీ దాడులను కేంద్రం కుట్ర అని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు జరిగిన ఐటీ దాడుల గురించి నోరు కూడా ఎందుకు మెదపడం లేదని అంబటి ప్రశ్నించారు. 
 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపై ఐదు రోజులపాటు ఐటీ దాడులు జరిగాయని అయినా చంద్రబాబు మౌనంగా ఉన్నాడంటే ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బాగోతం ఐటీ రైడ్స్ ద్వారా బయటపడిందని ఐటీకి మనీ లాండరింగ్ కు సంబంధించిన అనేక ఆధారాలు దొరికాయని అన్నారు. 2000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ప్రూవ్ అయినప్పటికీ లోకేశ్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించటం లేదని అన్నారు. 
 
సీనియర్ ఎన్టీయార్ చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అని స్వయంగా చెప్పారని రాష్ట్రంలో ఎన్నికల ఖర్చులు పెరిగిపోవటానికి కూడా చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబు పాపం పండి 2000 కోట్ల రూపాయలు దొరికాయని లోకేశ్ ను విచారిస్తే లక్షల కోట్ల రూపాయలు బయటపడతాయని అంబటి అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఐటీ దాడులను ఎలా మేనేజ్ చేయాలా అని కుట్ర పన్నుతున్నారని అంబటి చెప్పారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నీతి నిజాయితీ అంటూ మాట్లాడుతూ ఉంటారని ఐటీ దాడులలో 2000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు రుజువయినా పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మాజీ పీఎస్ కు సంబంధం లేకపోవచ్చు కానీ ఆ డబ్బుతో మాత్రం పార్టీకి సంబంధం ఉందని అంబటి అన్నారు. చంద్రబాబు పీఎస్ దగ్గరే అంత దొరికిందని పీఎస్ కంటే పైన ఉన్న చంద్రబాబు దగ్గర ఎంత దొరుకుతుందో అని అంబటి విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: