సులేమానీ హత్య చారిత్రక తప్పిదమని ఇరాన్ అభిప్రాయపడింది. అమెరికా దుందుడుకు చర్యల కారణంగా.. ఇరాక్ నుంచి విదేశీల బలగాలు వెళ్లిపోవాలనే తమ డిమాండ్ కు బలం చేకూరిందని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. తమ అణు కార్యక్రమం.. యూరప్ దేశాలు తీసుకునే అర్థవంతమైన చర్యల మీదే ఆధారపడి ఉందని తేల్చేసింది ఇరాన్. 

 

తమ దేశ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని చంపి అమెరికా తప్పు చేసిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ అన్నారు. జనరల్‌ సులేమానీ కంటే అమర సులేమానీ ఎక్కువ ప్రభావం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరాక్‌ నుంచి విదేశీ బలగాల్ని తొలగించాలన్న ఇరాన్‌ చిరకాల డిమాండ్‌ దిశగా పరిస్థితులు కదులుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణల తర్వాత ఇరాక్‌లో అమెరికా బలగాల్ని తొలగించాలన్న వాదన ఎక్కువైందని తెలిపారు. ఇరాక్ వీధుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఐరోపా దేశాలు సరైన విధానాలు పాటిస్తే.. తాము కూడా అణు కార్యక్రమాన్ని పునఃసమీక్షిస్తామని ప్రకటించారు. 

 

జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా హత్యచేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. సులేమానీతో పాటు ఇరాక్‌కు చెందిన అబు మహదీ అల్‌-ముహందిస్‌ అనే కమాండర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాక్ వీధుల్లో తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. విదేశీ బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని నినదించారు. ఇరాక్‌ పార్లమెంటు సైతం ఆ దిశగా తీర్మానం చేసింది. దీనిపై స్పందించిన అమెరికా.. సైనిక స్థావరాల ఏర్పాటు కోసం వెచ్చించిన ఖర్చును చెల్లిస్తేగానీ కదిలేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు అగ్రరాజ్యం ఆర్థికపరమైన ఆంక్షలకు నిరసనగా.. ఇరాన్‌ తమ అణుకార్యక్రమంలో దూకుడు పెంచింది. మొత్తానికి ఇరాన్.. అమెరికాపై అటాక్ మొదలుపెట్టింది. మాటల వేడి రాజేస్తోంది. సులేమానీ హత్యపై స్పందించిన ఇరాన్ ఇది ముమ్మాటికీ దుందుడుకు చర్యేనంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: