అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. న్యూఢిల్లీతో పాటు అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న ప‌ర్య‌టిస్తారు.  మొతెరా స్టేడియంలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొననున్నారు. అయితే, త‌న భార‌త ప‌ర్య‌ట‌న గురించి అమెరికా అధ్య‌క్షుడు మ‌రోసారి ట్వీట్ చేశారు. మ‌రో రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఆ ప‌ర్య‌ట‌న గురించి ఎంతో ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ సంబురం అలా ఉంచితే...భార‌త్‌కు మాత్రం ఖ‌ర్చు త‌డిసి మోపెడు అవ‌డమే కాకుండా ఇత‌ర స‌మ‌స్య‌లు సైతం తెర‌మీద‌కు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

 

 

 

భారత పర్యటనలో భాగంగా  ట్రంప్‌ తన  సతీమణి మెలానియాతో  గుజరాత్‌లోని  అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు.  ఈనెల 24న భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్‌ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం  సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపితకు ఘనంగా నివాళులర్పించనున్నారు. మొతెరాలో నిర్మితమైన  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ట్రంప్‌ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.  10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. వీరందరూ 25 మంది ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.  ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, 200 మంది ఇన్స్‌పెక్టర్లు, 800 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్‌ పటేల్‌ వెల్లడించారు. దీనికి అదనంగా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులతో పాటు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)కు చెందిన భద్రతా దళాలను ఇక్కడ మోహరించనున్నారు. ఈ భ‌ద్ర‌త‌కు భారీ ఖ‌ర్చు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

 

కాగా, ట్రంప్ భార‌త్ టూర్ ఎంతో క్రేజ్‌ను క‌లిగిస్తోంది. ఆయ‌న టూర్‌  ఫేస్‌బుక్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న‌ట్లు దాని ఓన‌ర్ మార్క్ జూక‌ర్‌బ‌ర్గ్ చెప్పిన విష‌యాన్ని ట్రంప్ త‌న ట్వీట్‌లో గుర్తు చేశారు.  త‌న‌కు ఆ స్థానం ద‌క్క‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. అయితే ఎఫ్‌బీలో రెండ‌వ స్థానంలో ప్ర‌ధాని మోదీ ఉన్నార‌న్న అంశాన్ని కూడా ఆయ‌న త‌న ట్వీట్‌లో ప్ర‌స్తావించారు. వాస్త‌వానికి తాను కూడా ఇండియా టూర్ ప‌ట్ల ఎంతో ఆస‌క్తితో ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: