దోమ‌లు... వాటి వ‌ల్ల క‌లిగే అనారోగ్యాల గురించి చెప్పుకుంటూ పోతే..లిస్ట్ భారీగానే ఉంటుంది. దోమల వల్ల  మెదడువాపు, బోదకాలు, విషజ్వరాలు, డెంగ్యూ,  ఇతర చర్మ సంబంధమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. డెంగీ వ్యాధి ప్రబలే దోమలు ఇండ్లలోని శుభ్రమైన నీటిలోనూ చేరే అవకాశం కూడా ఉంది.  ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దోమ‌ల స‌మ‌స్య ఎక్కువ‌. అయితే దీనికి చెక్ పెట్టేందుకు గ్రేట‌ర్ అధికారులు సిద్ధ‌మ‌య్యారు. 

 

 

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో దోమల నివారణ చర్యలకు గ్రేట‌ర్ అధికారులు సిద్ధ‌మ‌య్యారు. వర్షాకాలం వచ్చేలోగా సాధ్యమైనంత మేరకు దోమలను నివారించడమే లక్ష్యంగా ఐదు నెలల కార్యప్రణాళిక చేపట్టారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా చెరువులు, నాలాలు, మూసీ నదిలో దోమలపై యుద్ధం ప్రకటించారు. నగరంలోని చెరువులన్నీ మురుగునీటితో నిండిపోవడమే కాకుండా గుర్రపుడెక్కతో కమ్ముకొని పోవడంతో దోమల ఉత్పత్తి ఎక్కువవుతోంది. ఫలితంగా వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువైపోయి విష జ్వరాలు, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్పత్తి కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పలుచోట్ల నాలాలు, మూసీలో అత్తాపూర్‌ పిల్లర్‌ నం- 118 వద్ద, మియాపూర్‌, ఎల్బీనగర్‌, హఫీజ్‌పేట్‌, సంతోష్‌నగర్‌ ఎర్రకుంట చెరువు, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ, రవీంద్రనగర్‌, పెద్దచెరువు, చిన్నచెరువు, నల్లచెరువు తదితర చెరువుల్లో మందు పిచికారీ చేపట్టారు.

 


దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన స‌ర‌స్సులు, కుంట‌ల్లో మనుషులతో రసాయనాలు పిచికారీ చేయడం అంత సులభం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ డ్రోన్‌ టెక్నాలజీని చేపట్టింది. ఐదు నెలలపాటు, అంటే ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు నగరంలోని అన్ని చెరువులు, నాలాలు, మూసీలో డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందులను పిచికారీ చేసేందుకు కార్యప్రణాళిక సిద్ధంచేసి ఆ మేరకు పనులు చేపట్టారు. ఐదు నెలల్లో సమస్యాత్మక చెరువులు, నాలాలు, మూసీలో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసి వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా చేయాలన్నది వారి ప్రధాన లక్ష్యం. మనుషుల ద్వారా పనులు చేపట్టాలంటే ముందుగా గుర్రపు డెక్కను తొలగించి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతోమంది అవసరం. అంతేకాదు, సమయం కూడా ఎక్కువ పడుతుంది. సుమారు పది మంది మనుషులు 15 రోజులపాటు చేసే పనులను డ్రోన్‌ ద్వారా రెండు-మూడు గం టల్లోనే పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. చూద్దాం ఈ దోమ‌ల పోరాటం ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: