టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లేఖ రాశారు. చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకున్న 58 మంది ఇంజినీర్ల పరిస్థితిపై జనవరి 30న చంద్రబాబు లేఖ రాశారు. దీంతో చంద్రబాబుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శనివారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. క్షణాల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ ప్రమాదకర వైరస్‌ బారినపడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు వదిలారు.

 

చైనాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మొత్తం 58 మంది ఇంజినీర్లలో 56 మందిని వుహాన్ నుంచి ఎయిరిండియా విమానంలో ఫిబ్రవరి 1నే భారత్‌కు తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి జైకర్ తెలిపారు. ఈ 56 మంది ప్రస్తుతం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారని, వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అయితే మరో ఇద్దరు ఇంజనీర్లు అన్నెం జ్యోతి, దొంతంశెట్టి సత్య సాయికృష్ణ మాత్రం సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికంగా ఉండటంతో ఫిబ్రవరి 1న విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదని తెలిపారు.


ఈ ఇద్దరు చైనాలోని వుహాన్ హైటెక్ డెవలప్ మెంట్ జోన్, ఆప్టిక్స్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ లో స్టార్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజి కంపెనీ లిమిటెడ్ లోనే ప్రస్తుతం ఉన్నట్లు జైశంకర్, బాబుకు రాసిన లేఖలో వెల్లడించారు. బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులు వాళ్లిద్దరితో, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని తెలిపారు. ఇద్దరు ఇంజనీర్లకు కావాల్సిన వైద్య చికిత్స అందించాలని వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వుహాన్‌లోని వైద్యాధికారులను భారత ఎంబసీ అధికారులు కోరినట్లు పేర్కొన్నారు. వారిద్దరికీ సంబంధించిన విషయాలను మీకు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తామని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: