తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. రెండు ముఖ్య‌మైన అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ఈ భేటీ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ బడ్జెట్‌పై చర్చించడం ఓ అంశం కాగా, వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో గెలుపు సాధిస్తున్న నేప‌థ్యంలో... ప్ర‌జ‌ల‌కు అందించే సంక్షేమ ప‌థ‌కాల‌పై మ‌రింత అధ్య‌య‌నం చేయ‌డం ఇంకో అంశ‌మ‌ని తెలుస్తోంది. దీంతోపాటుగా ఈ ఎన్నిక‌ల విజ‌యాల తీరును సైతం చ‌ర్చించ‌నున్నట్లు స‌మాచారం. 

 


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశముంది.  వచ్చే (2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారు.  బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించి ఆర్థికశాఖ ఇప్పటికే పలు అంచనా ప్రతిపాదనలను సిద్ధంచేసినట్టు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసినట్టుగానే భారీ అంచనాలకు పోకుండా వాస్తవిక అంచనాలతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకొని అధికారులు బడ్జెట్‌ లెక్కలను రూపొందిస్తున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల, గ్రాంట్లలో కోత, జీఎస్డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) వృద్ధిరేటు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. 

 


15వ ఆర్థికసంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈసారి రాష్ట్రాల పన్నుల వాటాను 41 శాతానికి తగ్గించింది. దీంతో ఇప్పటివరకు కేంద్రంనుంచి రాష్ట్రానికి 2.437 శాతంగా వస్తున్న పన్నుల వాటా 2.133 శాతానికి తగ్గింది. ఈ నేప‌థ్యంలో ఆదాయవ్యయాలను పక్కాగా లెక్కిస్తున్నారు. అనవసర పద్దులకు పోకుండా అవసరమైన పనుల ప్రతిపాదనలను మాత్రమే ఆయా శాఖల నుంచి తెప్పించుకున్నారు.  ఈ నేప‌థ్యంలో జ‌రిగే కేబినెట్ భేటీలో...అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులతో పాటు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: