ఈనాడు- తెలుగు నాట అగ్రశ్రేణి దిన పత్రిక.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు నాట అగ్రగామిగా ఉన్న పత్రిక. ఈ పత్రిక తమకు వ్యతిరేకంగా రాస్తుందన్నది వైసీపీ నేతల ఫిర్యాదు. చంద్రబాబు అధికారం కోల్పోయాక.. జగన్ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు అనుకూల పత్రికలు తనపై అక్షర దాడి చేస్తాయని జగన్ కు సైతం తెలుసు. అయితే పత్రికలతో నేరుగా యుద్ధం చేసేందుకు సాధారణంగా రాజకీయ నాయకులు జంకుతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటారు. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే.. జగన్ ఈనాడు వంటి పత్రికలపై యుద్ధం ప్రకటించినట్టే కనిపిస్తోంది.

 

జగన్ క్యాబినెట్లోని ఓ మంత్రి.. ఏకంగా ఈనాడు రామోజీరావు పేరిట బహిరంగ లేఖ రాసిన తీరు చూస్తే.. సమర నినాదం మోగినట్టే అనిపిస్తోంది. మొన్న మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... అవకాశం వస్తే.. ఎన్డీఏలో చేరే విషయం పరిశీలిస్తామన్నారు. దాన్ని ఈనాడు అవసరమైతే ఎన్డీఏలో చేరతామని హెడ్డింగ్ పెట్టి రాసింది. దీనిపై మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ప్రస్తుత వివాదం చిన్నదే అయినా.. ఈనాడు తీరుపై మొదటి నుంచి ఉన్న కోపాన్ని లేఖలో చూపించారు.

 

బొత్స లేఖలోని కొన్ని వాక్యాలు పరిశీలిస్తే.. ఈనాడుపై ఉన్న కోపం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మచ్చుకు కొన్ని ..

 

మేం అనని మాటల్ని మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న ఈనాడు దినపత్రిక మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఈ ఉత్తరం రాస్తున్నా.."

 

" చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తో నేను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడాను. ప్రధానమైన ఈ విషయం మీ పత్రికకు ప్రధాన వార్త కాలేదు. మీకు ఇలాంటి మాటలు రుచించవు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అది మీ ఇష్టం – తెలుగు ప్రజల దౌర్భాగ్యం.”

 

అలాగే డాక్టర్‌ వైయస్సార్‌గారి మీద, వైయస్‌ జగన్‌గారిమీద మీ వ్యతిరేకత, శత్రుత్వం ఏనాడూ మీరు దాచుకున్నది లేదు.

 

" మేం రాజకీయంగా మా స్వతంత్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటున్నా, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రోజుకో ప్రచారం చేయటం మీ విధానం. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ఎలాగూ ప్రజల్లో పెంచలేరు కాబట్టి మమ్మల్ని చిన్నగీత చేయటానికి మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.”

 

"ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా?"

 

"మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించటం కోసం మీరు ఎంతటి అసత్యాలయినా పత్రికలో ప్రచురించటం తప్పు మాత్రమే కాదు... నేరం కూడా." ఈనాడు వార్త పై బొత్స స్పందించిన తీరు చూస్తే.. ఈనాడుపై యుద్ధాన్ని బహిరంగంగా ప్రకటించినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: