ధనం మూలం ఇదం జగత్.. అంటారు.. అలాంటిది ఇప్పుడు డబ్బును చూసి భయపడిపోయే రోజులు వచ్చేశాయి. కరెన్సీ నోట్లను చూస్తే ఆబగా అందుకోవాలనిపించడం కామన్ .. కానీ ఇప్పుడు ఈ కరెన్నీ నోట్లను చూస్తే జనం పారిపోయే రోజులు వస్తున్నాయి. అయితే ఇది మన దగ్గర కాదు లెండి చైనాలో.

 

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. చైనాను దడదడలాడిస్తోంది. కరోనా ఒక ఫ్లూ లాంటి జబ్బు.. దగ్గడం, తుమ్మడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే ఇప్పుడు కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోందని చైనాలో ఆందోళన మొదలైంది. కరెన్సీ నోట్లు ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినప్పుడూ కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని చైనీయులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా వేల సంఖ్యలో జనం మరణిస్తుండటంతో ఇప్పుడు నోట్లపైనా ఆంక్షలు మొదలయ్యాయి.

 

సాధారణంగా కరోనా రోగులకు దూరంగా ఉంటే కరోనా రాకుండా కాపాడుకోవచ్చు. కానీ కరోనా రోగులు ముట్టుకున్న కరెన్సీ ఒక దగ్గరే నిలవదు కదా.. అందుకే.. కరెన్సీని చూస్తే ఇప్పుడు చైనా వణుకుతోంది. కరెన్సీ కట్టల కదలికల్ని కట్టడి చేస్తున్నారు. డబ్బు నోట్లకు ప్రత్యామ్నాయంగా ఇ-కామర్స్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వాడుకోవాల్సిందిగా ప్రభుత్వ వర్గాలే సలహా ఇస్తున్నాయి. కరెన్సీ నోట్లకు బదులుగా ఆన్‌లైన్‌ సేవల్ని విస్తారంగా ఉపయోగించుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజల్ని కోరుతోంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల మధ్య కరెన్సీ నోట్ల బదలాయింపునూ నిలిపేశారు.

 

 

కరెన్సీ నోట్లను చేతులతో తాకడం ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవచ్చనే ఆందోళన నెలకొంది. అందుకే.. భారీ ఎత్తున నోట్లను సేకరించి, గిడ్డంగులకు తరలించేస్తున్నారు. నోట్లను ప్రజలకు ఇచ్చేటప్పుడు వాటిలో వైరస్‌ లేకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో నోట్ల కొరత రాకుండా చూడాలని ‘పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా’ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: