నిర్భయ అత్యాచార ఉదంతం.. దేశాన్ని కుదిపేసింది. సుమారు ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులోనే మెడికోను అత్యంత దారుణంగా రేప్ చేశారు. మర్మాంగంలో ఇనుప రాడ్లు చొప్పించి మరీ అత్యాచారం చేశారు. అలాంటి నికృష్టులను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ చట్టం అంటూ ఒకటి ఉందిగా.. ఆ చట్టం ప్రక్రియలో ఏడేళ్లు గడిచిపోయాయి.

 

చివరకు కోర్టులు ఆ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేశాయి. ఈ అమానుష హత్యాచార కేసులో ఒకడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు బాల నేరస్థుడు. వాడు బతికిపోయాడు. మూడేళ్లు జువైనల్ హోంలో ఉంచి ఆ తర్వాత వదిలేశారు. 2014 మార్చి నెలలో మరణ దండనను దిల్లీ హైకోర్టు ఖరారు చేసింది. అయినా ఇప్పటికీ అది అమలు కాలేదంటే.. ఇందుకు దోషులు చూపిస్తున్న చావు తెలివితేటలే కారణం.

 

వాళ్ల అప్పీళ్లను సుప్రీంకోర్టు 2017లోనే కొట్టేసింది. కానీ నిర్భయ దోషలు పదే పదే కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. శిక్ష వాయిదాకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఏడో తేదీన దిల్లీ న్యాయస్థానం డెత్ వారంట్ కూడా జారీ చేసినా.. ఉరి శిక్ష అమలు కాలేదు. జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తిహార్‌ జైలులో నలుగురినీ ఉరి తీయాలన్న ముహూర్తం కూడా నిర్ణయించారు.

 

కానీ మరో దోషి ముకేశ్‌ సింగ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన సమర్పించాడు. అది తిరస్కరణకు గురైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన నర రూప రాక్షసుల్ని ఉరి తీయాలంటూ జనవరి మూడో వారంలో మళ్లీ డెత్‌వారంట్లు జారీ అయ్యాయి. ఇక్కడో మరో దోషి చావు తెలివి ప్రదర్శించాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. మరి ఈ దోషులకు ఉరి శిక్ష పడేదెప్పుడో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: