మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో సారవంతమైన భూములు, అనుభవజ్ఞులైన రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ రోజురోజుకు వ్యవసాయరంగం కుంచించుకుపోతుందన్నమాట మాత్రం వాస్తవం. రైతులకు రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్న క్రమంలో తాజాగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. వ్యవసాయ రుణాల పరిమితిని గతంతో పోలిస్తే భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దేశవ్యాప్తంగా రైతులకు రుణాల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. రైతులు 7 శాతం వడ్డీ చొప్పున గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశం కేంద్రం కల్పిస్తోందని రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. 
 
కేంద్రం 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రుణాల పరిమితిని పెంచిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతుల సంక్షేమం కొరకు బడ్జెట్ లో 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. 1,60,000 కోట్ల రూపాయలలో దాదాపు 75,000 కోట్ల రూపాయలను పీఎం కిసాన్ పథకానికి కేటాయించామని నిర్మలాసీతారామన్ అన్నారు. 
 
క్షేత్రస్థాయి నుండి రైతులకు రుణాల పరిమితిని పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయని విజ్ఞప్తుల మేరకు రుణ పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్రం బ్యాంకులు రైతులకు అందించే రుణాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రతి సంవత్సరం రుణాల లక్ష్యాన్ని సాధారణంగా 9 శాతం పెంచుతారని కానీ రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచామని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.5 లక్షల కోట్ల రూపాయలు రుణాల లక్ష్యంగా ఉందని నిర్మలాసీతారామన్ చెప్పారు. కేంద్రం రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: