నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావో తెలుసుకోవాలంటే.. అసలు నువ్వు ఎక్కడి నుంచి ఆరంభించావో తెలుసుకోవాలి.. నువ్వు ఏం సాధించావో లెక్కేయాలంటే.. నీ ప్రస్థానం ఏ స్థాయి నుంచి మొదలైందో తెలుసుకోవాలి.. చేతిలో లక్ష ఉన్నవాడు పది కోట్లు సంపాదించడం కష్టం కాదు.. చేతిలో చిల్లి గవ్వ లేనివాడు.. కోటి సంపాదిస్తే అదీ గొప్ప. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి విజయగాథే.

 

 

ఆయన చదివింది కేవలం పదో తరగతి. ఆ తర్వాత కొన్నాళ్లు వ్యవసాయం.. మళ్లీ పీజీడీసీఏతో చదువు బాట. అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం. ఇప్పుడు చెప్పండి.. టెన్త్ క్వాలిఫికేషన్ తో కేవలం పీజీడీసీఏ చదువుతో.. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించాడంటే అతడెంత ఖతర్‌నాకో. తీరా మైక్రోసాఫ్ట్‌ లో 12 రౌండ్స్‌ ఇంటర్వ్యూ క్లియర్ చేశాక వాళ్లు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అడిగితే తన దగ్గర ఉన్నది కేవలం పదో తరగతి సర్టిఫికెటే మాత్రమే.

 

 

ఒక కాలేజీ డ్రాపవుట్‌ స్థాపించిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో ప్రతిభ ఉన్న ఓ కుర్రాడికి అవకాశం ఇవ్వలేరా?’ అని అతడు అడిగిన సూటి ప్రశ్న అతడికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం తెచ్చి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉద్యోగం. అయినా అక్కడితో ఆగిందా విజయప్రస్థానం. తన దేశంలో తనవాళ్ల కోసం పనిచేయాలన్న తపనతో అంత గొప్ప సంస్థనూ వదిలేసి ఇండియా వచ్చాడు.

 

 

కోటి గ్రూప్‌ ఆఫ్‌ వెంచెర్స్‌’ పేరుతో కొత్త ప్రయాణం ప్రారంభించాడు. విద్య, వైద్యం, వ్యవసాయం, మీడియా ఇలా పలు రంగాల్లో కంపెనీలు స్థాపించాడు. మొత్తం 14 కంపెనీలకు అధిపతి అయ్యాడు. ఇప్పుడు ఆ కంపెనీల విలువ దాదాపు 700 కోట్ల రూపాయలపై మాటే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. నిత్యం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 238 దేశాల్లోని 784 కోట్ల మందికి సేవలు అందించడం గురించే ఆయన తపన అంతా. అందివస్తున్న సాంకేతికతను ప్రజాబాహుళ్యానికి చేరువ చేయాలని.. విద్య,ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేవాలన్నదే ఆయన ప్రయత్నమంతా. ఇంతకూ ఈ విజేత పేరు చెప్పలేదు కదూ. ఆయనే సరిపల్లి కోటిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: