రెండు రోజులుగా ఇండియాలో మోస్ట్ వైరల్ అయిన కంటెంట్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ గౌడ గురించే. మంగళూరుకు సమీపంలో ఉన్న ఖాద్రి లో జరిగిన సాంప్రదాయ కంబాల పోటీల్లో శ్రీనివాస్ గౌడ పరుగెట్టిన తీరుకు యావద్భారతం ఆశ్చర్యపోతోంది. ఓవర్ నైట్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన గౌడ ప్రతిభ గురించి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘శ్రీనివాస్ గౌడ కు మంచి ట్రైనింగ్ అవకాశాలు కల్పించి.. ప్రతిభకు సానబెట్టండి’ అంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు ట్యాగ్ చేశారు.

 

 

దీనిపై కిరణ్ రిజుజు వెంటనే స్పందించారు. ‘భారతదేశంలో ఏ క్రీడాకారుడి ప్రతిభ మరుగున పడకూడదనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఒలింపిక్స్ ప్రమాణాల గురించి అందరికీ అవగాహన ఉండదు. అథ్లెటిక్స్ మనిషిలోని శక్తి సామర్ధ్యాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తాయి. ఇప్పటికే SAI అధికారులు ఆయనను సంప్రదించారు. అతని శక్తి సామర్ధ్యాలను సోమవారం బెంగళూరులో పరిక్షిస్తారు. అతనికి ట్రైన్ టికెట్స్ కూడా పంపించాం’ అంటూ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ ప్రతిభ గురించి బీజేపీ నాయకుడు మురళీధర్ రావు, మాజీ మంత్రి శశి ధరూర్ కూడా స్పందించారు. 100 మీటర్ స్ప్రింట్ లో ఇతనికి శిక్షణనిస్తే ఖచ్చితంగా ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు అని ట్వీట్ చేశారు.

 

 

బురదలోనే అంత వేగంగా పరుగు పెట్టిన శ్రీనివాస్ గౌడ రన్నింగ్ ట్రాక్ పై పరిగెత్తే విధంగా ట్రైనింగ్ ఇస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అంటున్నారు. ఒలింపిక్స్ నిర్వహించే పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి గౌడకు అందుకు అనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి దేశంలో బయటకొచ్చిన ప్రతిభను ఆలస్యం కాకుండా గుర్తించి చర్యలు తీసుకుంటున్న కేంద్రం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: