వరంగల్ జిల్లాలో కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్నారు కొందరు మైనర్లు. రబ్బరు...ఎలక్ట్రానిక్ వస్తువులు అతికించేందుకు వినియోగించే గమ్‌ని డ్రగ్స్‌గా వాడుతున్నారు. మత్తుకోసం మైనర్ల చేష్టలను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

 

వరంగల్ జిల్లాలో డ్రగ్స్‌కు అలవాటు అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆ మధ్య గంజాయి సేవించే వారు జిల్లాలో అక్కడక్కడ పట్టుపడుతూ ఉండేవారు. ఇంజినీరింగ్ విద్యార్థులు..మరికొందరు జులాయిలు గంజాయి సేవించే వారిలో ఉండేవారు. అయితే .. ఇటీవల వరంగల్ జిల్లాలో కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్నారు మైనర్లు. వైట్నర్న్...లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు...రబ్బరు...సింథటిక్ వస్తువులను అతికించేందుకు వినియోగించే గమ్‌ని మత్తు కోసం వాడుతున్నారు. వరంగల్ నగరమే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ ఈ దందా కొంతకాలంగా సాగుతోంది. ఈ తరహా మత్తుకు అలవాటు పడ్డవాళ్ళు మైనర్లు కావడం తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తోంది. 

 

చిన్నారులు కెమికల్ గమ్‌ను పీలుస్తూ మద్యాన్ని మించిన మత్తుకు బానిసలవుతున్నారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నలుగురు మైనర్ బాలురు కొంతకాలంగా గమ్ వాసన పీల్చుతూ మత్తులోకి జారుకుంటున్నారు. ఓ విద్యార్థి ఇంటి దాబాపై గమ్ ప్లాస్టిక్ కవర్లో పెట్టి నోటివద్ద పెట్టుకుని పీలుస్తుండగా గమనించారు తల్లిదండ్రులు. తమ కుమారుడిని మందలించి స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాము కొన్ని రోజులుగా అదే గ్రామంలో ఓ ఎలక్ట్రికల్ షాపులో గమ్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సదరు బాలురు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. ఇలాంటి ప్యాకెట్ కవర్లు పాఠశాల ప్రాంగణంలో మరికొన్ని కనిపించాయి. పట్టుపడ్డ ఈ నలుగురు విద్యార్థులే ఉన్నారా?లేక మరింత మంది ఉన్నారా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

మరోవైపు...ఈ రకమైన మత్తుకు అలవాటు పడ్డ మైనర్లు స్కూల్‌కి వెళ్లడం లేదు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన ఓ బాలుడు చుట్టపు చూపుగా వచ్చి ఇక్కడి పిల్లలకు గమ్ వాసన పీల్చడం చూపించాడు. దీంతో స్థానిక మైనర్లు కూడా దీనికి అలవాటు పడినట్లు అధికారుల విచారణలో తేలింది. అయితే... మత్తుకోసం వాడుతున్న ఈ గమ్ ప్యాకెట్‌ని 18 ఏళ్లు నిండని వారికి విక్రయించరాదనే నిబంధనలు ఉన్నాయి. ఆ షాపు యజమాని ఎలా అమ్ముతున్నాడాని అరా తీశారు అధికారులు. మైనర్లకు ఇక నుంచి అమ్మకూడదంటూ హుకుం జారీ చేశారు. ఏది ఏమైనా వరంగల్ జిల్లాలో కొత్త రకం మత్తుకు అలవాటుపడ్డ తీరు మాత్రం పేరెంట్స్‌లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: