తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్ టాపిక్ అయింది. అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది. ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు పెద్ద‌లు. ప్రపంచంలో బెస్ట్‌ సింగర్‌ తల్లే అని ఒప్పుకుంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు. లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది.

 

లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తుంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతు న్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తోందన్నమాట.

 

లాలిపాట పాడుతూ పిల్లవాడితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలామంది తల్లులు డెలివరీ తర్వాత, శరీరంలోని హార్మోనుల మార్పులతో డిప్రెషన్‌కు లోనవుతారు. దీన్నే పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంభాలించుకుంటూ, పిల్లవాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట.  అలాగే అన్నం తినిపించే ట‌ప్పుడు త‌ల్లి పిల్ల‌వాడి కోసం ఒక ర‌కంగా పాట‌ను పాడుతుంది. అలా ప‌డుకోబెట్టేట‌ప్పుడు ఒక‌లాగా ఏడ్చేట‌ప్పుడు ఒక‌లాగా ఇలా ర‌క ర‌కాలుగా లాలిస్తూ త‌ల్లి త‌న బిడ్డ‌కి నెమ్మ‌ది నెమ్మ‌దిగా అన్నీ అల‌వాటు చేస్తుంది. బిడ్డ అన్నంతిన‌క‌పోయినా, నిద్ర‌పోక‌పోయినా త‌ల్లి వాడే మొద‌టి మంత్రం త‌ల్లి లాలిపాట‌. త‌న‌కు వ‌చ్చే విధంగా పాట‌ను పాడుతూ పిల్లాడు నిద్ర‌లోకి జారుకునేలా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: