కర్నూలు జిల్లా గుట్కా అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులకు స్థానిక పోలీసులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ షాపు మాటున గుట్కా వ్యాపారం చేస్తున్న డాన్‌ను అరెస్ట్ చేయటం జిల్లాలో కలకలం రేపుతోంది. 


 
కర్నూలు జిల్లాలో గుట్కా వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. కోవెలకుంట్లకు చెందిన గుట్కా డాన్ మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా సామ్రాజ్యంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లాలో చాప కింద నీరు లాగా గుట్కా మాఫియా సామ్రాజ్యం విస్తరిస్తుండటంపై కన్నెర్ర చేస్తున్నారు పోలీసులు. గుట్కా వ్యాపారుల ఆట కట్టించేందుకు జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు.

 

మనోహర్ అక్రమ వ్యాపార సామ్రాజ్యంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుట్కాను అక్రమంగా జిల్లాకు చేరవేసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని జిల్లాలోని నలుమూలలకు విస్తరింపజేస్తున్నాడు. మనోహర్ గుట్కా వ్యాపారానికి సంబంధించి గత కొంత కాలంగా పోలీసులు డేగ కన్ను వేసి ఉంచారు. పక్క ప్లాన్‌తో స్కెచ్ వేసిన పోలీసులకు కచ్చితమైన సమాచారం రావడంతో మనోహర్ ఇంటిపై ఆకస్మిక  దాడులు చేశారు. భారీ ఎత్తున నిల్వ ఉంచిన గుట్కా సంచులు స్వాధీనం చేసుకున్నారు. మనోహర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


 
అయితే...మనోహర్ సాగిస్తున్న అక్రమ గుట్కా వ్యాపారానికి కొందరు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవెలకుంట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఆంధ్రా మెడికల్ స్టోర్ నిర్వహిస్తుంటాడు మనోహర్. మెడికల్ స్టోర్ ముసుగులో గత కొన్ని సంవత్సరాలుగా గుట్కా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. గుట్కా వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత కోట్లకు అధిపతిగా మారాడు మనోహర్. తనకు వచ్చే ఆదాయంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు అందిస్తున్నాడు. మనోహర్ నుండి నెల మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


 
మనోహర్ విస్తరించిన అక్రమ గుట్కా వ్యాపార సామ్రాజ్యంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరనే యాంగిల్‌లో దర్యాప్తు చేపట్టారు. అంతర్ రాష్ట్రాల్లో ఉండే గుట్కా మాఫియా డాన్ ఎవరు? అనే విషయం నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరికి నెలవారీగా మామూళ్లు అందుతున్నాయి అనే విషయంపైనా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో అక్రమ గుట్కా వ్యాపారంలో సహకారం అందించిన కొందరు పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

 

ఇక... విచారణలో భాగంగా మనోహర్‌ను పోలీసులు బళ్లారికి తరలించారు. క్రైమ్ పార్టీకి చెందిన ప్రత్యేక పోలీసు బృందం బళ్లారిలో కూపీ లాగుతోంది. అక్రమ వ్యాపారంలో భాగస్వాములుగా ఎవరెవరు  ఉన్నారో వారిపై కేసులు నమోదు చేశారు. బళ్లారిలోని గుట్కా మాఫియా డాన్  కోసం  ప్రత్యేక పోలీసుల బృందం వేట కొనసాగిస్తోంది. తీగ లాగితే డొంక అంతా కదలి పోతుందనే భయాందోళనలు..కొందరు పోలీసులకు కునుకు లేకుండా చేస్తోంది. మొత్తానికి...గుట్కా డాన్ మనోహర్ వ్యవహారం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: