తెలంగాణలో బీజేపీ ని పరుగులు పెట్టించాలని చూస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టాలనే  లక్ష్యంతో పాటు ...తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని బిజెపి కంకణం కట్టుకుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ టిఆర్ఎస్ హవా ముందు బిజెపి తేలిపోతోంది. దీనికి కారణం పార్టీని ముందుకు నడిపించగల సమర్థవంతమైన రాష్ట్ర నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణంగా అధిష్టానం గుర్తించింది. ప్రస్తుతం బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు.


 ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవి కోసం ఎంపీ బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తదితర నాయకులు ఆశపడుతున్నారు. అయితే అధ్యక్ష పదవి విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ బిజెపికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. పార్టీని ముందుకు నడిపించే విషయంలో కెసిఆర్ కు అన్ని విషయాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తన సత్తా చాటుతున్నారు.


దీని ద్వారా కేసీఆర్ మీద అంతగా ఒత్తిడి పడకపోవడమే కాకుండా ప్రెసిడెంట్ ఒకవైపు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరోవైపు పార్టీ పటిష్ఠతకు కృషిచేస్తున్నారు. ఇక ఆ తరహాలోనే బీజేపీ కూడా కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి టీఆర్ఎస్ తరహాలోనే పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ను తప్పించి ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెట్టినా మిగతా వారు అసంతృప్తి గురవుతారని భావిస్తున్న బీజేపీ అధిష్టానం, ఆ పదవిలో ఆయన్ను అలానే ఉంచి, కొత్తగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి అందులో రాష్ట్ర స్థాయిలో బలమైన, చురుకైన నాయకుడి నాయకత్వంలో ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. ఆ పదవి ఎవరికి దక్కుతుందో అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మొత్తంగా బిజెపి వ్యవహారం చూస్తుంటే టిఆర్ఎస్ ఢీ కొట్టేందుకు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలనే ఇప్పుడు అనుసరించేందుకు సిద్ధమైనట్టు గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: