కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు.. మ‌హా రుషుల‌వుతారు అన్న నానుడి క‌ష్ట‌పడి నిజం చేసిన మ‌హా మ‌నుష్యులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లు ప‌దుల మందికి.. వంద‌లు.. వేలు.. ల‌క్ష‌లు.. కోట్ల మందికి ఆద‌ర్శ‌మ‌వుతారు... ఈ కోవ‌లోకే వ‌స్తారు స‌రిప‌ల్లి కోటిరెడ్డి. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని జ‌గ‌న్నాథ‌పురం అనే మారుమూల గ్రామంలో పుట్టిన కోటి రెడ్డి జీవితం కేవ‌లం రు.750తో ప్రారంభ‌మై ఈ రోజు మిలియ‌న్ డాల‌ర్ల వ్యాపార సామ్రాజ్యం వ‌ర‌కు విస్త‌రించింది.



2001 నుంచి 18 సంవ‌త్స‌రాల్లో ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో ఇబ్బందుల‌తో సొంత ఊళ్లో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ నుంచి ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన మైక్రోసాఫ్ట్ యాప్ ఆర్కిటెక్ కోర్ టీంలో ఉన్న న‌లుగురిలో ఒక‌డిగా ఎదిగే వ‌ర‌కు ప‌డిన క‌ష్టం ఎంతో ఉంది. ఎంతో మంది ఇలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారే ఉంటారు. అయితే అతి సాధార‌ణ దిగువ త‌ర‌గతి రైతు కుటుంబంలో పుట్టి కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకుని త‌న కిష్ట‌మైన కంప్యూట‌ర్ కోర్సుల‌ను ప‌ట్టుద‌ల‌తో నేర్చుకున్న కోటిరెడ్డి ఈ రోజు మైక్రోసాఫ్ట్ నుంచి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్‌కు ఎక్కే వ‌ర‌కు తిరుగులేకుండా దూసుకుపోయారు.



2004లో మైక్రోసాఫ్ట్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఉద్యోగానికి ఎంపికైన కోటిరెడ్డి ప‌దేళ్ల త‌ర్వాత తాను ఇండియాలో సొంత కంపెనీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌ను నిజం చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగానికి ఎంపికైన రోజునే ఆయ‌న ఇండియ‌లో కంపెనీ పెట్టాల‌నుకున్నారు. కోటిరెడ్డి ఆ క‌ల‌ను 2014లో నిజం చేసుకున్నారు. ఆ యేడాది కోటి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్ ప్రారంభించారు. దీని కింద భార‌త్ ఇన్నోవేష‌న్ ల్యాబ్ పేరుతో మ‌రో కంపెనీ ఉంది. దీనిలో ఇంట‌ర్న్స్‌తో పాటు ఆన్‌రోల్‌లో వంద‌లాది మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.



మ‌న‌దేశంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో భార‌త్ ఇన్నోవేష‌న్స్ సేవ‌లందిస్తోంది. అలా కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్ ప‌ట్టుకుని రు.700తో హైద‌రాబాద్ వ‌చ్చిన కోటిరెడ్డి నేడు మైక్రోసాఫ్ట్ నుంచి 14 కంపెనీల బాస్ గాను.. మిలియ‌న్ డాల‌ర్ల సామ్రాజ్యాధినేత‌గా ఎద‌గ‌డంతో పాటు ఎంతో మందికి ఉపాధితో పాటు త‌న లాభాల్లో 33 శాతం సేవ‌ల‌కే వినియోగిస్తున్నారు. మ‌నిషికి ఆలోచ‌న‌తో పాటు ఆచ‌ర‌ణ ఉంటేనే ప‌దిమందికి ఆద‌ర్శ‌నీయం అవుతార‌నేందుకు కోటిరెడ్డి ఓ నిద‌ర్శ‌నం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: