ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఎన్డిఎలో చేరే విషయమై చెలరేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో ఇదే వార్త ఇప్పుడు ఎక్కువగా హడావుడి చేస్తుంది అనేది వాస్తవం. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ ఎందుకు కలుస్తుంది అని వైసీపీ నేతలు అంటే కలిస్తే పలానా వాటి మీద సమాధానం చెప్పాలి అంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డిఎలో చేరే అవకాశం ఉందని మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఈ నేపధ్యంలో బొత్సా సత్యనారాయణ స్పందించారు. తాను అసలు ఆ మాట అనలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 

ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి, ఏపీ బిజెపి ఇంచార్జ్ కలిసేది లేదని అంటున్నారని, మేం కలుస్తామని చెప్పామా అంటూ బొత్సా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, వైసీపీ ఎన్డియేలో కలిస్తే తాను ఉండేది లేదని పవన్ అంటున్నారని, అసలు తాము కలుస్తామని ఎప్పుడు చెప్పాం అని నిలదీశారు. ఎన్డిఎలో చేరాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. ఐటి శాఖ ప్రకటనలో చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయని బొత్సా ఆరోపించారు. ఓడినప్పటి నుంచి టీడీపీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

 

వాళ్ళు కలిస్తే నేను ఉండేది లేదని పవన్ అంటున్నారు. అసలు ఎవరు కలవమన్నారు ఎవరు పొమ్మన్నారు అంటూ మండిపడ్డారు. కొందరు చంద్రబాబుని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసారు బొత్సా. టీడీపీ సీనియర్ నేత యనమల పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. మీ ప్రముఖ వ్యక్తి దగ్గర రెండు వేల కోట్లు సీజ్ చేసామని ఐటి చెప్పినందుకా అని బొత్సా ప్రశ్నించారు. తాను మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తుందని, వైసీపీకి మైనార్టీలను దూరం చెయ్యడానికి చూస్తున్నారని, తాము బిజెపితో కలిసేది లేదని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: