ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ప్రత్యామ్నాయంగా సారా తయారీ పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని సరిహద్దు...అటవీ ప్రాంతాలే కేంద్రాలుగా చేసుకొని సారా తయారీ జోరుగా సాగుతోంది.

 

 గుంటూరు జిల్లాలో సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులకు చేతినిండా పని తగిలింది. ఇదే సందర్భంలో నాటు సారా తయారీపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ తీర ప్రాంతంతో పాటుగా బాపట్ల సమీపంలోని మడ అడవులు, పెద కూరపాడు నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో సారా తయారీ పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే కిక్కు లభిస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మందుబాబులు అన్వేషిస్తున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని సారా తయారీ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో చీకటి పడిన తరువాత నుంచి మొదలు తెల్లవారే సమయం వరకు సారా తయారీలో తలమునకలవుతున్నారు. అధికారులు దాడులకు వచ్చే సమయంలో గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేస్తున్నారు. బాపట్ల మండలం స్టువర్టుపురం అంటేనే సారా తయారీకి పరిశ్రమగా పేరొందింది. ఇక్కడ సారా తయారీలో ఆరితేరిన వారికైతే అసలు కొదవేలేదు. బాపట్ల మండలంలోని చాలా గ్రామాల్లో నాటుసారా ప్రభావం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

ఇప్పటికే ప్రభుత్వం మద్యంపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో సారా బట్టీల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో ఎక్సైజ్ అదికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై ఉక్కుపాదం మోపడంతో నాటు సారా తయారీదారులు తమ చేతికి పనులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అడవుల్లో.. మారుమూల ప్రాంతాల్లో ఏ మాత్రం అనుమానం రాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: