పాత ఎప్పటికైనా రోత గానే కనిపిస్తుంది. రాజకీయాల్లో అయితే గెలిచిన వారికి ప్రాధాన్యం ఉంటుంది తప్ప ఓడిపోయిన వారికి అంతగా ప్రాధాన్యం ఉండదు. వారు ఎంత కీలకమైన వ్యక్తులైనా.. బలమైన నాయకులైనా వారి వల్ల పార్టీకి ఏదైనా కలిసి వచ్చేది ఉంటేనే వారికి పదవులు, పలకరింపులు ఉంటాయి లేకపోతే వారు క్రమ క్రమంగా తమ హవాను కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల పరిస్థితి ఆ విధంగానే తయారయింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. 


రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వారిని చాలా దూరం పెట్టారు. వారు అధినేతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కేసీఆర్ వారిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ విధంగా పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వర రావు, మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు, వేణుగోపాలచారి ఇలా చాలామంది ఉన్నారు. రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. తుమ్మల నాగేశ్వరరావు 2019 ఎన్నికలలో ఓడిపోయారు. ఆయనపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల హవా పూర్తిగా తగ్గిపోయింది. 


అదీ కాకుండా ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ మంత్రిగా ఉండడం తో తుమ్మల మాట చెల్లుబాటుకావడంలేదు. అలాగే జూపల్లి కృష్ణరావు పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మొన్నటివరకు తనకు ఏదైనా పదవిని కట్టబెట్టకపోతారా అని ఆశగా ఎదురుచూశారు. అయినా లాభం లేకపోవడంతో మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులను రెబల్ గా దింపి తన సత్తా చూపిద్దాం అని ప్రయత్నించినా టిఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.


 మొదటి సరిగా గెలిచినా తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేణుగోపాలచారి పదవీకాలాన్ని ఆ తర్వాత పొడిగించి లేదు. దీంతో ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇలా చాలామంది పార్టీ తమను పట్టించుకోవడం లేదన్న బాధ తో పాటు పూర్తిగా పక్కన పెట్టేసారు అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. కేసీఆర్ మాత్రం వారిని చేరదీసి ఉద్దేశంలో లేరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: