టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బైంసా లో ఇటీవల జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఈరోజు బిజెపి నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. కేంద్ర హోంమంత్రి సహా మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తదితరులు ఈరోజు బైంసా లో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ సంఘటనను ఉద్దేశించి గల్లీ లొల్లిగా పేర్కొంటూ సీఎం కేసీఆర్ మాట్లాడడం తగదని , కేసీఆర్ కు దమ్ముంటే ఇక్కడకి రావాలని వస్తే ఇది గల్లీ లొల్లా పెద్ద లొల్లా నిరూపిస్తామంటూ ఆయన సవాల్ విసిరారు. 


బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కేసీఆర్ కు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతారని నేను ఊహించలేదు అంటూ సంజయ్ అన్నారు. ఓట్ల కోసం టిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు దిగజారుడు రాజకీయాలు చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీని కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ పార్టీ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ బైంసాలో అల్లర్లు పునరావృతం అయితే  తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని తీవ్రస్థాయిలో వాటిని ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.


 ఔరంగజేబు శివాజీ పోరు ప్రస్తుతం సాగుతోందని.. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బైంసా అల్లర్లతో బాధిత కుటుంబాలు అన్ని రోడ్డున పడ్డాయని, తాను ప్రభుత్వంతో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందేలా చేస్తానంటూ ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: