బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరి కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. కేవలం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల్లో వాటా కేటాయించడం జరిగిందని ఆమె అన్నారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడం వల్ల ఆర్థిక సంఘమే ఒక శాతం కేటాయింపులు తగ్గించాలని సిఫారేసు చేసిందని ఆమె వివరణ ఇచ్చారు.జిఎస్టి పరిహారం చెల్లింపులో కూడా తెలంగాణ విషయంలో అన్యాయం జరిగిందనే వాదాన్ని ఆమె ఖండించారు. జిఎస్ టి పరిహారం   వసూళ్లు తగ్గడం వల్లనే పరిహారం చెల్లింపులు అన్ని రాఫ్ట్రాలకు జాప్యం అయినట్టు ఆమె తెలిపారు.

 

పరిహారం సెస్ తప్పితే కేటాయింపులకు కేంద్రం వద్ద అదనపు నిధులేవీ లేవని ఆమె వివరణ ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గుతున్నాయన్న వాదాన్ని కూడా ఆమె తోసి పుచ్చారు.ఆ పథకానికి డిమాండు ఆధారంగా నిధులు కేటాయిస్తామని, డిమాండు అధికంగా ఉంటే నిధులు కూడా పెరుగుతాయని ఆమె వెల్లడించారు. డిమాండు లేకపోవడం వల్లనే నిధుల కేటాయింపులు తగ్గినట్టు ఆమె చెప్పారు. 2000 నోట్ల రద్దు గురించిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అది ఇంతవరకు తన దృష్టికి రాలేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.756 కోట్ల ప్రత్యేక గ్రాంటు కూడా అందలేదని ఒక విలేకరి ఆమె దృష్టికి తీíకురాగా ఆ అంశం తిరిగి ఆర్థిక సంఘం పరిశీలనకే పంపామని ఆమె చెప్పారు. ఆర్థిక సంఘం ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేసిందో తెలియచేస్తే దానికి అనుగుణంగా చర్య తీసుకుంటామని ఆమె అన్నారు.

 

స్థానిక కారణాల వల్లే రాష్ట్రాల్లోని రైల్వే పనులలో జాప్యం జరుగుతోంది. నిధుల కేటాయింపు జరగక జాప్యం అనేది సరికాదు.ప్రాజెక్టుల వారీగా వివరాలు అందిస్తే సమస్యలను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. 2010-15 మధ్య కాలంతో పోలిస్తే గడిచిన ఐదేండ్ల కాలంలో తెలంగాణకు కేటాయింపులు దాదాపు 128 శాతం పెరిగి రూ.1.07 లక్షల కోట్లకు చేరుకున్నాయని  కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి టి వి సోమనాథన్ అన్నారు. అంతకుముందు జరిగిన మొదటి సెషన్లో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి బ్యాంకర్, రైతు సంస్థల ప్రతినిధులతో, రెండవ సెషన్లో ఆర్థికవేత్తలు, టాక్స్ ప్రాక్టీషనర్స్ , అకాడెమియా ( విద్యా రంగ నిపుణులు) ,  విధాన రూపకర్తలతో ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ వివిధ బడ్జెట్ అంశాలపై సమాలోచనలు జరిపారు. ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి  అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి  రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి, వ్యయశాఖ కార్యదర్శి సొమనాథన్, సీబీడీటీ చైర్మెన్ పి.సి. మోడీ, సీబీఐసీ చైర్మెన్ అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: