జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేన పార్టీయేనని ప్ర‌క‌టించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కార్యకర్తలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాల్లో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. జనసేన పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయే పార్టీ కాదని, ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకొనే పార్టీ అన్నారు.

 


కుళ్లు, కుంతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని... ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చెప్పారు. ``అవినీతి, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు చూసి ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చాను. కులం, జాతి చూసి ఓటేస్తే ఏ పార్టీ గెలవదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు. ఓటుకు రెండువేలు, బైక్ లు ఇవ్వడం అప్పుడు లేవు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని ప్రకటిస్తే ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. అలాంటి జనం, సమాజం ఇప్పుడు లేదు. సేవ చేస్తామంటే శంకించే పరిస్థితులు వచ్చాయి.`అని వ్యాఖ్యానించారు.

 


ఓట్లు కొనని రాజకీయాలు వస్తేగానీ భవిష్యత్తు మారదని ప‌వ‌న్ విశ్లేషించారు. ``2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోలేదు. నిజంగా ఓడిపోయి ఉంటే వైజాగ్ లాంగ్ మార్చ్, సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కర్నూలు లో చేసిన నిరసన ర్యాలీకి లక్షలాది మంది జనం వచ్చేవారు కాదు. ఎన్నికల్లో ఓడినా ప్రజల మనసులు గెలుచుకోగలిగాం. తెలుగుదేశం పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీ ఇవాళ బలంగా లేదు. దానికి కారణం ఆ పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బులతో కొనుక్కున్నవి కావడం. జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బుతో కాదు ఇష్టంతో వేసినవి. ప్రతి ఓటు చాలా విలువైనది. అందుకే ఓడిపోయినా కూడా బలంగా ప్రజల తరపున పోరాటాలు చేయగలుగుతున్నాం. అమరావతి విషయంలో తెలుగుదేశం వెనకబడిపోయినా ఇవాళ ఆ ఉద్యమాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లగలుతుంది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగుండాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటాం కనుకే జనసేన పార్టీకి ఈ బలం. జనసేన పార్టీకి ప్రతి వార్డులో కనీసం 5 మంది జనసైనికులు ఉంటే దాదాపు 500 మంది అభిమానులు ఉన్నారు. పోరాట యాత్రలో జైకొట్టిన అభిమానులు... ఎన్నికల సమయంలో మాత్రం కులాలు, మతాలు, భయాలు, ప్రలోభాలకు లొంగిపోవడంతో అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేకపోయాం. సుదీర్ఘ ప్రయాణం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టే  ఓటమి గెలుపునకు మెట్టుగా భావించాను.` అని వివ‌రించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: