నిధుల కేటాయింపుపై కేంద్రం, తెలంగాణ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  బడ్జెట్‌పై కేటీఆర్ చేసిన కామెంట్లకు కేంద్ర మంత్రులు కౌంటర్  ఇచ్చారు. అన్ని రాష్ట్రాలతో సామర్యసంగా ఉండటమే తమ విధానమన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని తెలంగాణ మంత్రులకు సవాల్ విసిరారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  కిషన్ రెడ్డి. 

 

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గురువారం ఓ టీవీ షోలో పాల్గొన్న కేటీఆర్.. బడ్జెట్‌ లో తెలంగాణకు కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నామన్న కేంద్ర వైఖరిని కేటీఆర్ తప్పుబట్టారు.. తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో ఎంత చెల్లించిదో.. కేంద్రం తిరిగి ఎంతిచ్చిందో లెక్క చెప్పాలన్నారు.

 

బడ్జెట్‌ అనంతరం వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేటీఆర్ కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలన్నదే తమ విధానమన్నారు. పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది అవాస్తమన్నారు. గివెన్ అనే పదం పార్లమెంట్ రికార్డ్స్ లో ఉందని, కావాలంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని.. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటా అధికంగానే ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

 

మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయంలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం చిత్తశుధ్ధితో ఉందన్నారు. రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం 28 రూపాయలు భరిస్తే...రాష్ట్రం కేవలం 2 రూపాయలు మాత్రమే ఇస్తోందన్నారు.

 

సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఘర్షణ నెలకొంది. కేంద్రం నిధులను... తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా వినియోగంచడం లేదని గతంలో పలువురు బీజేపీ నేతలు కామెంట్స్ చేశారు. తాజాగా బడ్జెట్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి నిధుల అంశం తెరపైకి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: