అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో మ‌న దేశంలో ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. న్యూఢిల్లీతో పాటు అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న ప‌ర్య‌టిస్తారు.  మొతెరా స్టేడియంలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు పాల్గొననున్నారు.  ‘ఫేస్‌బుక్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ నెంబర్‌ వన్‌ అని, తర్వాత ప్రధాని మోదీ ఉన్నారని ఇటీవల జుకర్‌బర్గ్‌ అన్నారు. ఇది గొప్ప గౌరవం అనుకుంటా! నిజానికి, రెండు వారాల్లో నేను భారత్‌కు వెళ్లబోతున్నా. ఆ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్రంప్ సోష‌ల్ మీడియాలో సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే, భార‌త్ పొరుగుదేశ‌మైన శ్రీ‌లంకు అమెరికా షాకులు ఇస్తోంది.

 

శ్రీలంక సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ షవేంద్ర సిల్వ తమ దేశంలోకి రాకుండా అమెరికా నిషేధం విధించింది. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని తెలిపింది.  2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలో షవేంద్ర చట్టవిరుద్ధంగా పౌరులను చంపారని ఆరోపించింది. ‘అంతర్యుద్ధం సమయంలో షవేంద్ర భారీగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితితో పాటు పలు సంస్థలు గుర్తించాయి. ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఉన్నది. ఇది తీవ్రమైన చర్య’ అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. మరోవైపు, షవేంద్రపై అమెరికా నిషేధం విధించడంపై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం విశ్వసనీయతను పరిశీలించి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

 

కాగా,  భారత పర్యటనలో భాగంగా  ఈనెల 24న భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్‌ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం  సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపితకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. మొతెరాలో నిర్మితమైన  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ట్రంప్‌ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.  10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. వీరందరూ 25 మంది ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.  ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, 200 మంది ఇన్స్‌పెక్టర్లు, 800 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్‌ పటేల్‌ వెల్లడించారు. దీనికి అదనంగా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులతో పాటు  నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)కు చెందిన భద్రతా దళాలను ఇక్కడ మోహరించనున్నారు. ట్రంప్‌కు ఏర్పాటు చేస్తున్న ఈ విశేష‌మైన భ‌ద్ర‌త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: