తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి భూములను అమ్మాలని నిర్ణయించింది . ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీ లో తీర్మానించారు .   దాదాపు 10 వేలకోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా అందుబాటు లో ఉన్న ప్రభుత్వ , అసైన్డ్, అటవీ , దేవాదాయ శాఖ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది . అయితే ఉప్పల్ భగాయత్ తరహా లో ల్యాండ్ ఫ్యూలింగ్ వెంచర్లపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది . ఉప్పల్ భగాయత్ లో రైతుల నుంచి భూములు సేకరించిన హెచ్ ఎం డి ఏ , అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించింది.  

 

మిగిలిన ప్లాట్లను విక్రయించి హెచ్ ఎం డి ఏ  సొమ్ము చేసుకుంది . ఇదే తరహా లో ప్రతాపసింగారం , మోకిళ్ల, కొర్రెముల లో వెంచర్ల ఏర్పాటు ద్వారా ఆదాయవనరులను సమీకరించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది .  భూముల విక్రయంతో పాటు , ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువను పెంచాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది . అదే జరిగితే భూముల మార్కెట్ విలువ పెరిగి రిజిస్ట్రేషన్ , స్టాంప్స్ శాఖ నుంచి ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగనుంది . గత ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  రిజిస్ట్రేషన్ , స్టాంప్స్ శాఖ నుంచి ఆదాయం పెద్ద ఎత్తున లభిస్తోంది .

 

ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా స్థిరాస్తి వ్యాపారం జోరందుకోవడం , భూముల క్రయ, విక్రయాలు పెరగడంతో రిజిస్ట్రేషన్ , స్టాంప్స్ శాఖ ఆదాయం కూడా పెరిగి , ప్రభుత్వ ఖజానాకు సిరులు కురిపిస్తోంది . తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పై కూడా కేబినెట్ భేటీ లో చర్చించి , రోగులకు ఉచిత పరీక్షలను చేయాలని నిర్ణయించినట్లు  తెలుస్తోంది . అదే సమయం లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి పింఛన్ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం .   

మరింత సమాచారం తెలుసుకోండి: