పుల్లారావు చేసిన పాపాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌దని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని స్ప‌ష్టం చేశారు. య‌డ‌వ‌ల్లి సొసైటీ భూములు ద‌ళితుల‌వేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు  పేర్కొన్నారు. సొసైటీ రిజిస్ట్రార్‌ రివిజ‌న్ అథారిటీ ఇటీవ‌ల య‌డ‌వ‌ల్లి సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం య‌డ‌వ‌ల్లిలోని సొసైటీ భూముల‌ను ఆదివారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ భూములు ముమ్మాటికీ ద‌ళితుల‌వేన‌ని చెప్పారు. అదే భూముల్లో సాగ‌వుతున్న వ‌రి పైరును ఆమె ప‌రిశీలించారు.

 

పచ్చ‌ని పంటకు జీవం పోసే ఈ భూముల‌ను ఉప్పు భూములుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు చేశార‌ని ఆరోపించారు. ఈ పాపం ఊరికేపోద‌ని హెచ్చ‌రించారు. ద‌ళితుల జీవితాల‌తో ఆట‌లాడుకోవాల‌నుకున్న పుల్లారావుతో పాటు టీడీపీ నాయ‌కులు చేసిన పాపాన్ని మోయ‌క‌త‌ప్ప‌ద‌ని చెప్పారు. సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ రివిజ‌న్ అథారిటీ తీర్పును ఇవ్వ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ద‌ళితులు వారి సొసైటీని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని సూచించారు. సొసైటీని పున‌రుద్ధ‌రించుకుని కార్య‌క‌లాపాల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని చెప్పారు.

 

త్వ‌రలోనూ ఈ భూముల‌కు ప‌ట్టాలు కూడా ఇప్పించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. భూముల‌కు ప‌ట్టాలు ఇప్పించే విష‌యానికి సంబంధించి న‌ర‌స‌రావుపేట ఆర్డీవో వెంక‌టేశ్వ‌ర్లు, చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం త‌హ‌శీల్దార్ ల‌క్ష్మి ప్ర‌మీళ‌కు ఫోన్ చేశారు. వెంట‌నే ప‌ట్టాలు ఇప్పించే కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టాల‌ని అధికారులకు సూచించారు. ఈ విషయమై  ప్ర‌భుత్వంతో తాను మాట్లాడ‌తాన‌ని ఎమ్మెల్యే చెప్పారు. య‌డ‌వ‌ల్లి దళిత రైతుల‌తో త్వ‌ర‌లోనే సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లుస్తామ‌న్నారు. పుల్లారావు ద‌ళితుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్ర‌త్తిపాటి పుల్ల‌రావు అజ్ఞానంతో త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

 

త‌న‌ను విమ‌ర్శించే హ‌క్కు పుల్లారావుకు లేద‌న్నారు. య‌డ‌వ‌ల్లి సొసైటీ భూముల‌ గురించి మాట్లాడే ముందు పుల్లారావు ద‌ళితుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌జ‌ల సొమ్మును అప్ప‌నంగా దోచుకున్న నీచ చ‌రిత్ర పుల్లారావుద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబం ఎప్ప‌డూ క‌ష్టాన్నే న‌మ్ముకుంద‌న్నారు. ఎక్క‌డా ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా తాను ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు. అవినీతి ర‌హిత నియోజ‌క‌వ‌ర్గాన్ని చూడటం కోసం నేను చేస్తున్న పోరాటం చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న‌ని స్ప‌ష్టం చేశారు.

 

త‌న‌ను ఆత్మ‌విమ‌ర్శ చేసుకోమ‌నే ముందు పుల్లారావు తాను ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని చెప్పారు.  సొసైటీ భూముల్లో పంట‌లు వేసుకున్న ప‌లువురు రైతులు మాట్లాడుతూ.. గ‌తంలో విద్యుత్ లేక పంట న‌ష్ట‌పోతున్న స‌మ‌యంలో ఎమ్మెల్యే ర‌జిని త‌న సొంత డ‌బ్బుల‌తో ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఏర్పాటు చేయించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. సొసైటీ రిజిస్ట్రార్ అధికారుల‌తో నిరంత‌రం మాట్లాడుతూ ఎమ్మెల్యే త‌మ‌కు అండగా నిలిచార‌ని ద‌ళితులు ఆనందం వ్య‌క్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: