మనిషి అంటే ఒక ప్రాణమున్న దేహం. రక్తమాంసాలతో కూడుకుని దుర్గందాన్ని లోన దాచిన శరీరం.. మనిషి మనిషి అని అహాంకారముతో విర్రవీగుతావు. నిత్యం అలంకరణతో, సర్వ సుఖాలను అందిస్తూ, మట్టిలో కలిసే దేహాన్ని చూసి మురిసిపోతావు.. నీ బ్రతుక్కి అర్ధం తెలుసుకోలేక, కోరికల కావడిలో మగ్గిపోతావు.. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక, బలహీనపడుతున్న ఆత్మని గ్రహించలేక అజ్ఞానంలో బ్రతుకుతావు.. నీవు బ్రతికి ఉన్నంతవరకు నీ పేరు, ఊరు, బంధువులు, బంధుత్వాలు  నీ పక్కనే ఉంటాయి. పోయాక పేరుతో పాటే ఊరు మట్టిలో కలిసిపోతుంది. మన అనుకున్న బంధాలు కన్నీళ్ల దగ్గరే ఆగిపోతాయి..

 

 

మరి ఎందుకురా నీకు ఈ అహంకారం, అదుపులేని ఆశల మణిహరం. నేను మనిషిని అని చెప్పుకుంటావు, అందులో నేను మగాడినని రొమ్ము విరుస్తావు. మగతనం అంటే నలుగురు అమ్మాయిలతో సుఖాలు అనుభవించడం కాదు. మగాడంటే పదిమందితో తిరుగుతూ, ఆడపిల్ల పరువును బజారుపాలు చేయడం కాదు.. రేపులు , హత్యలు చేస్తే మగాడు అనే స్టాంప్ పడుతుందా.. కన్న తల్లిని గోసపెడితే, కన్న తండ్రిని కసాయివానిగా చూస్తే నువ్వు మగవాడివై పోతావా..? తోటి స్నేహితులను అవసరాలకు వాడుకుంటూ, అసూయ ద్వేషాలతో నిత్యం రగిలిపోతు, నమ్మకద్రోహం చేస్తూ, నటించడమే మగతనమా..?

 

 

ఎక్కడ ఆడది దొరుకుతుందా, ఎక్కడ అవినీతి చేద్దామా అని ఆలోచించడమే మగతనమా..? నీ మనసునే ప్రశ్నించుకో నీకు తెలియని నీ గురించి నమ్మలేని నిజాలు ఎన్ని చెబుతుందో... ఇక మగాడంటే రక్షణ కలిగించే వాడే గాని గాడిదలా ఎదిగి, గాడ్రింపు పెడుతూ గందరగోళం సృష్టించే వాడు కాదు.. నేటి కాలంలో మగవాన్నే కాదు, మగ పశువుని చూసినా అమ్మాయిలు భయపడే రోజులు వచ్చాయి..

 

 

దీనికంతటికి కారణం. నీ పెంపకం. నీలోని రాక్షసత్వం.. నీలోని మూర్ఖత్వం.. నిజంగా నేటిసమాజంలో మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు వచ్చాయి.. అందులో మగాన్ని అని చెప్పుకొవడానికి ఇంకా సంకోచించాలి.. ఎందుకంటే మృగం కంటే ఎక్కువగా కౄరంగా ప్రవర్తించే  మగచేష్టలు చూస్తే చెప్పు తెగుద్ది ఏముందిరా నీలో అనే రోజులు వస్తాయంటున్నారు కొందరు.. అందుకే మనిషిగా జీవించడం నేర్చుకో, మానవత్వంతో బ్రతకడం అలవాటు చేసుకో.. కన్న వారి పేరు నిలపెట్టేలా బ్రతుకు, లేదంటే మనిషి అన్నపదం వింటేనే ముందు ముందు అసహ్యమేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: